గన్నేరువరం, వెలుగు: ప్రజాహిత యాత్ర నిర్వహిస్తున్న ఎంపీ బండి సంజయ్‌కు శుక్రవారం గన్నేరువరం మండలంలో నిరసన సెగ తగిలింది. గన్నేరువరం తహసీల్ ఆఫీస్ వద్ద గన్నేరువరం బ్రిడ్జి సాధన సమితి జేఏసీ లీడర్లు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ గత ఎంపీ ఎన్నికలకు ముందు గన్నేరువరం నుంచి కరీంనగర్ మార్గంలో మండలకేంద్రంలో మానేరుపై బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు.
బ్రిడ్జి పూర్తయితే బెజ్జంకి , ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాలకు చెందిన 80 గ్రామాల ప్రజలు అత్యవసర సమయాల్లో కరీంనగర్ వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరసన తెలిపిన బ్రిడ్జి సాధన జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో జేఏసీ అధ్యక్షుడు సంపతి ఉదయ్ కుమార్, భామండ్ల రవీందర్, పుల్లెల జగన్ ,పుల్లెల రాములు, కయ్యం సంపత్ పాల్గొన్నారు.