ఎస్సీ రిజర్వేషన్లను 20 శాతానికి పెంచండి : వివేక్ వెంకటస్వామి

ఎస్సీ రిజర్వేషన్లను 20 శాతానికి పెంచండి : వివేక్ వెంకటస్వామి
  • బడ్జెట్​లో ఎస్సీలకు 18 శాతం ఫండ్స్ కేటాయించండి: సీఎంను కోరిన మాల సంఘాల జేఏసీ నేతలు
  • ఎమ్యెల్యేలు వివేక్ వెంకటస్వామి, కేఆర్ నాగరాజు, రాగమయి, వినోద్‌‌‌‌తో కలిసి వినతిపత్రం అందజేత
  • వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ ను రద్దు చేసి.. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల రీ సర్వే చేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీల రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలని, బడ్జెట్​లో ఎస్సీల సంక్షేమానికి 18 శాతం నిధులు కేటాయించాలని మాల సంఘాల జేఏసీ నేతలు సీఎం రేవంత్​రెడ్డిని కోరారు. కులగణన సర్వేలో ఎస్సీల జనాభా తగ్గించారని, మళ్లీ ఇంటింటి సర్వే చేసి ఎస్సీల వివరాలు సేకరించాలని నేతలు కోరారు. శనివారం అసెంబ్లీ లాబీలోని  సీఎం చాంబర్​లో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, కేఆర్ నాగరాజు, గడ్డం వినోద్, మట్టా రాగమయి నేతృత్వంలో మాల సంఘాల జేఏసీ నేతలు చెన్నయ్య, రాంచందర్​తో పాటు పలువురు నేతలు సీఎం రేవంత్​రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

రాష్ట్రంలో ఎస్సీ కులాల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దుచేసి.. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల రీ సర్వే చేసేలా  ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కమిషన్ నివేదిక అశాస్త్రీయంగా, హేతుబద్ధత లేకుండా, అసంపూర్తిగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించడం, ఆయా వర్గాలకు శాతాల కేటాయింపులో ఎలాంటి శాస్త్రీయత పాటించలేదని, సైద్ధాంతిక డేటాను పరిగణనలోకి తీసుకోలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ‘ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదిక కరెక్ట్​గా లేదు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేశారు. 

ప్రస్తుతం ఎస్సీ జనాభా చాలాపెరిగింది. ఈ రిపోర్ట్ అశాస్ర్తీయంగా, అన్యాయంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది’ అని నేతలు పేర్కొన్నారు. 2011 జనాభాతో పోలిస్తే.. 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ జనాభా 10 లక్షలు పెరిగిందని, ఇప్పుడు మరింత పెరిగిందని నేతలు పేర్కొన్నారు. ఏకసభ్య కమిషన్ నివేదికను అమలుచేయొద్దని సూచించారు. కాగా, ఈ విషయమై త్వరలో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు జేఏసీ నేతలు తెలిపారు.