
కోల్బెల్ట్, వెలుగు: కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం, చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని, కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు, రైతులకు నష్టం చేసే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్చేస్తూ వచ్చే నెల16న దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొననున్నారు. ఈ మేరకు సోమవారం సింగరేణి కాంట్రాక్ట్కార్మిక సంఘాల జేఏసీ నాయకులు యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం కింద రూ.26 వేలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్చేశారు. కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులకు నష్టం చేసే నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. 2022 జేఏసీ ఒప్పందంలోని పెండింగ్ అంశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్చేశారు. సింగరేణి కాంట్రాక్ట్కార్మికులు సమ్మెలో పాల్గొని సక్సెస్ చేయాలని పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు యర్రగాని కృష్ణయ్య, బి.మధు, ఎస్.డి.రాసుద్దీన్, ఎ.వెంకన్న, ఎస్.కె.యాకూబ్ షావలి, వై.ఆంజనేయులు, క్రిస్టోఫర్, నాగేశ్వరరావు, పి.సతీశ్, డి.వీరన్న, జి.శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.