- లక్ష డప్పులు, వెయ్యి గొంతుకల ప్రోగ్రాంలో పాల్గొంటున్నది బీజేపీ అనుబంధ సంస్థల నేతలే
బషీర్ బాగ్, వెలుగు: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఈ నెల 7న లక్ష డప్పులు, వేయి గొంతుకలు కార్యక్రమంతో మాలలకు చావు డప్పులు కొడతున్నామని చేస్తున్న ప్రచారాన్ని మాల సంఘాల జేఏసీ తీవ్రంగా ఖండించింది. మందకృష్ణ చావు డప్పులు కొట్టాల్సింది ఆయనకు ప్రియ మిత్రుడైన ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, నిత్యం కాళ్లు మొక్కే మాజీ ఉప రాష్ట్రవతి వెంకయ్యనాయుడికి అని అన్నారు. జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య, కో చైర్మన్లు బేర బాలకృష్ణ, బూర్గుల వెంకటేశ్వర్లు, మందాల భాస్కర్, గోవతి రమేశ్, జంగా శ్రీనివాస్ సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణను మాదిగలే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. లక్ష డప్పులు, వేయి గొంతుకలు కార్యక్రమంలో మాదిగలు పాల్గొనడం లేదని, అందులో బీజేపీ అనుబంధ సంస్థల నేతలు పాల్గొంటున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో మందకృష్ణ మాదిగ, బీజేపీ లీడర్లు ఆడుతున్న నాటకంలో సీఎం రేవంత్ రెడ్డి బలికాక తప్పదన్నారు. ఆయన సీఎం పదవికే ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత ఎన్నికల్లో మాలల ఓట్ల ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఆయన గ్రహించాలన్నారు.
ఆర్టికల్ 347 ప్రకారం రాష్ట్రాలు వర్గీకరణ అమలు చేయకూడదని రాజ్యాంగంలో ఉందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ అంశంలో తటస్థంగా ఉండాలన్నారు. ‘‘హామీ ఇచ్చిన ప్రధాని వర్గీకరణ చేయకుండా ఎందుకు వెనక్కి తగ్గారు. సుప్రీంకోర్టు తీర్పునకు, మోదీ ఇచ్చిన హామీకి సంబంధం లేదు. వర్గీకరణకు అడ్డుపడుతున్నది మోదీయే”అని అన్నారు.
మాలలకు చావు డప్పు కొడుతామంటే ఊరుకోం
మంద కృష్ణమాదిగ బీజేపీకి డప్పు కొడుతూ.. మాలలకు చావు డప్పు కొడతామంటే చూస్తూ ఊరుకోమని, ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెన్నయ్య హెచ్చరించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారని, ఈ ఉద్యోగాలను భర్తీ చేయమని మోదీని అడిగే దమ్ము కృష్ణమాదిగకు ఉందా అని ప్రశ్నించారు. వర్గీకరణ కావాలంటే పార్లమెంట్ ఎదుట నిరాహారదీక్షలు చేసి బిల్లు పెట్టించుకోవాలన్నారు. కానీ, మాదిగలను తప్పుదారి పట్టించేందుకు మాలలపై తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు క్షమించరన్నారు.
ప్రజాగాయకుడు గద్దర్ నక్సలైట్అయినందువల్లనే పద్మశ్రీ ఇవ్వలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారని, ఒకప్పుడు కృష్ణమాదిగ కూడా నక్సలైటే అని, ఆయనకు పద్మశ్రీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అలాగే, కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ కు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని విమర్శించే స్థాయి లేదని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే విమర్శించడం తగదన్నారు.