- అసెంబ్లీలో మాలల గురించి మాట్లాడని మాల ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తాం
- ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సంఘాల జేఏసీ నిరసన
ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం చేసిన తీర్మానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై తీర్మానం జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, నాగరాజు తప్ప.. ఎవరు మాట్లాడలేదన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై మాట్లాడని మాల ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చేసిన తీర్మానానికి నిరసనగా మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సంఘాల జేఏసీ నిరసన చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తర్వాత వారిని అరెస్టు చేసి, పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం చెన్నయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మాలలను ఆ పార్టీయే మోసం చేసిందన్నారు. ఉమ్మడి ఏపీలో ఉన్న రిజర్వేషన్ల కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పించి మాలలకు అన్యాయం చేసి గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాల కులాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మరో 8 మంది మాల ఎమ్మెల్యేలు వర్గీకరణపై మాట్లాడకపోవడం సిగ్గుచేటున్నారు. మాలల ద్రోహి భట్టి విక్రమార్కనే అని ధ్వజమెత్తారు. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి, మాలల పక్షాన మాట్లాడని ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చెరుకు రామచందర్, గోపోజు రమేశ్ బాబు, వెంకటేశ్వర్లు, రాజు వస్తాద్, సరళ, నాను, రమ పాల్గొన్నారు.