ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి: రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్

ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి: రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న నాలుగు లక్షల మంది మాలలను కాంగ్రెస్  ప్రభుత్వం అణిచివేస్తున్నదని తెలంగాణ మాల సంఘాల జేఏసీ మండిపడింది. మాల శాసనసభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించింది. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో  సోమవారం హైదరాబాద్ ట్యాంక్  బండ్ వద్ద సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జేఏసీ నాయకులు బేర బాలకిషన్, చెరుకు రామచందర్, జంగ శ్రీనివాస్, మంచాల లింగస్వామి, దాసరి విశాల్, రఘునాథ్, రాజేశ్, నరసింహ, శ్రీహరి, గాదె కుమార్  హాజరయ్యారు. 

నేతలు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీ ఇచ్చిన హామీ మేరకు చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్  చేశారు. రిజర్వేషన్  అంశంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్దామంటే మాల ఎమ్మెల్యేలు, జేఏసీ నాయకులను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. మందకృష్ణ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తలొగ్గి ఎస్సీ వర్గీకరణ చేస్తే రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాల మధ్య శాశ్వతంగా ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఎస్సీలపై అధ్యయనం చేయడానికి వేసిన షమీమ్​అక్తర్  కమిషన్ రిపోర్ట్  పూర్తిగా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. 30 సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమం వల్ల ఎస్సీలు వెనుకబడ్డారని, మాల ఉప కులాలు తీవ్రంగా నష్టపోయాయని పేర్కొన్నారు.