పెండింగ్ డీఏల కోసం ఉద్యోగుల పోరుబాట

 పెండింగ్ డీఏల కోసం ఉద్యోగుల పోరుబాట
  • ఉద్యోగుల జేఏసీని సీఎం చర్చలకు పిలవాలి
  • వచ్చే కేబినెట్ మీటింగ్​లో పెండింగ్ డీఏలను ప్రకటించాలి
  • ఆర్థిక భారం లేని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేపట్టాలని ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. వచ్చే నెల 2 నుంచి జనవరి వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో ఆఫీసులో 206 సంఘాలతో కూడిన జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మీటింగ్ అనంతరం జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మీడియాతో మాట్లాడారు. వచ్చే కేబినెట్ మీటింగ్​లో పెండింగ్ డీఏలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఐదు డీఏలు పెండింగ్​లో ఉండడం చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. 

‘‘డీఏలు, మెడికల్ బిల్లులు, ఈహెచ్ఎస్ స్కీమ్, లోక్ సభ ఎన్నికల టైమ్ లో బదిలీ అయిన ఉద్యోగులను తిరిగి పాత స్థానాల్లోకి పంపించడం, సీపీఎస్ రద్దు తదితర మొత్తం 50 సమస్యలు ఉన్నాయి. ‘‘వీటి వల్ల 10 లక్షల ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలని మంత్రులు, సీఎస్, ప్రభుత్వ సలహాదారులను కలిసి విన్నవించాం. సీఎంను కలిసి సమస్యలు వివరించాలంటే ఆయన అపాయింట్ మెంట్ దొరకడం లేదు. లోక్​సభ ఎన్నికల టైంలో డీఏ విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చినా ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. ఈ నెల 28న సీఎం, సీఎస్​కు ఉద్యమ కార్యాచరణ వినతి పత్రాలు అందజేస్తాం. వచ్చే నెల 2 నుంచి జనవరి చివరి వరకు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనలు చేస్తాం. 

అన్ని ఉమ్మడి జిల్లాల్లో సదస్సుల నిర్వహణ, లంచ్ మోషన్ ధర్నాలు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు, బైక్ ర్యాలీలు, మానవహారాలు చేపడతాం” అని జగదీశ్వర్​ వెల్లడించారు. ఉద్యోగులు తమ పిల్లల లగ్గాలు, ఇండ్ల నిర్మాణం, ఆరోగ్య సమస్యలకు జీపీఎఫ్ నిధులు కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేశారు. మన రాష్ట్రంలో కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. ఉద్యోగులు, ప్రభుత్వ వాటాతో కలిపి ఈహెచ్ఎస్ స్కీమ్ అమలు చేయాలన్న డిమాండ్ ఎంతో కాలంగా ఉంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక భారం లేని సమస్యలను వెంటనే పరిష్కరించాలి” అని జగదీశ్వర్ డిమాండ్ చేశారు. 

ఇన్ని రోజులు ఓపిక పట్టాం: శ్రీనివాసరావు 

ఒక్క డీఏ పెండింగ్​లో ఉన్నా గతంలో ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయని ఉద్యోగుల జేఏసీ కో చైర్మన్ ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. ‘‘గత 10 నెలల కాలంలో  రైతుబంధు, రుణమాఫీ అని చెబితే రైతుల సంక్షేమం దృష్ట్యా ఓపిక పట్టాం. ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగుల 50 సమస్యల్లో 44 ఆర్థిక భారం లేనివే. వీటిని పరిష్కరించడానికి ఉద్యోగుల జేఏసీతో సీఎం, సీఎస్ చర్చలు జరపాలి” అని కోరారు. సమావేశంలో టీఎన్జీవో, టీజీవో జనరల్ సెక్రటరీలు ముజీబ్, సత్య నారాయణ, కృష్ణయాదవ్, ఇంటర్ జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, పెన్షనర్ల ప్రతినిధి లక్ష్మయ్య, యుటీఎఫ్ నుంచి చావా రవి తదితరులు పాల్గొన్నారు.