రామగుండం ప్లాంట్​ను జెన్​కోకే కేటాయించాలి : భట్టి విక్రమార్క

రామగుండం ప్లాంట్​ను జెన్​కోకే కేటాయించాలి : భట్టి విక్రమార్క
  • డిప్యూటీ సీఎంకు పవర్ జేఏసీ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రామగుండం ప్లాంట్ ను జెన్​కో సంస్థకే కేటాయించాలని కోరుతూ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బుధవారం కలిసి వినతిపత్రం అందించారు. జెన్ కో ద్వారానే థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తే 2,500 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. సింగరేణి సంస్థలో 49 శాతం కేంద్రం వాటా ఉందని.. జెన్ కో మాత్రం నూరు శాతం ర్రాష్ట ప్రభుత్వ రంగ సంస్థ అని వారు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు తక్కువ ధరకే కరెంట్ లభించి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రామగుండం ప్లాంట్ ను మూసివేసి ఆ 540 ఎకరాల స్థలాన్ని సింగరేణికి కేటాయిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు ఆందోళన వ్యక్తం చేశారు.  

ఏపీ పెన్షన్ బాకీలు రూ.3,392 కోట్లు.. 

విద్యుత్ ఉద్యోగుల పెన్షన్ ట్రస్టుకు సంబంధించి తెలంగాణ జెన్ కోకు ఏపీ జెన్ కో నుంచి రూ. 2,478 కోట్లు, తెలంగాణ ట్రాన్స్ కోకు ఏపీ ట్రాన్స్ కో నుంచి రూ.914 కోట్లు మొత్తం కలిపి రూ.3,392 కోట్లు రావాల్సి ఉందని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 6న జరగబోయే రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చించి తెలంగాణ విద్యుత్ సంస్థలకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన రూ.28,842 కోట్లు, డిస్కంలు జెన్ కోకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్లు చెల్లించేలా కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. విద్యుత్ సంస్థల బలోపేతం కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి నెలా విద్యుత్ సబ్సిడీ, గృహజ్యోతి నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జెన్ కో ఆర్థికపరంగా కొత్త ప్లాంట్ నిర్మించడానికి సిద్ధంగా ఉంటే ప్రభుత్వం కూడా సుముఖంగా ఉందన్నారు.