ధార్మిక పరిషత్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి : గంగు ఉపేందర్ శర్మ

ధార్మిక పరిషత్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి : గంగు ఉపేందర్ శర్మ

సూర్యాపేట, వెలుగు : అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేందర్ శర్మ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేటలోని అన్నపూర్ణ సహిత విశ్వనాథస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని, కానీ అధికారులు తమ పెత్తనం పోతుందని సరైన నివేదిక ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ పాలనలో అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి రూ.70 కోట్ల నిధులు కేటాయించారని, పదేళ్లలో సేకరించిన రూ.210 కోట్లకు వడ్డీ రూ.14 కోట్లు వస్తున్నా అందులో రూ.7  కోట్లు కూడా అర్చకుల సంక్షేమానికి ఖర్చు చేయడం లేదన్నారు. 

అర్చకుల పిల్లల వివాహాలు, ఇంటి నిర్మాణాలకు అర్చక వెల్ఫేర్ బోర్డు నుంచి ఖర్చు చేయాల్సి ఉండగా, అలా చేయడం లేదని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ధూపదీప నైవేద్య అర్చకులకు రూ.12 వేల వేతనం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే అర్చకుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఆస్థాన సిద్ధాంతి అవసరాల ప్రసాద్ శర్మ, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వీరభద్రశర్మ, సాగర్ శర్మ, సతీశ్​ పాల్గొన్నారు.