IND vs ENG, 1st Test: ఇంగ్లాండ్‌కు ఎదురు దెబ్బ.. స్టార్ స్పిన్నర్‌కు గాయం

IND vs ENG, 1st Test: ఇంగ్లాండ్‌కు ఎదురు దెబ్బ.. స్టార్ స్పిన్నర్‌కు గాయం

భారత్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసిన ఇంగ్లాండ్ కు ఊహించని షాక్ లు తగులుతున్నాయి. వీసా కారణంగా షోయబ్ బషీర్ మ్యాచ్ కు ముందు భారత్ లో అడుగుపెట్టలేదు. తాజాగా ఆ జట్టు స్టార్ స్పిన్నర్.. అనుభవజ్ఞుడు జాక్ లీచ్ తొలి టెస్టులో గాయపడ్డాడు. హైదరాబాద్ వేదికగా భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. బౌండరీని కాపాడే ప్రయత్నంలో లీచ్ గాయపడ్డాడని ఇంగ్లండ్ స్పిన్ బౌలింగ్ కోచ్ జీతన్ పటేల్ వెల్లడించాడు. 
  
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో లీచ్ సీనియర్ స్పిన్నర్. గతంలో భారత పిచ్ లపై ఆడిన అనుభవం ఉండటంతో పాటు ఇక్కడ మంచి రికార్డ్ ఉంది. ఒకవేళ ఈ ఇంగ్లాండ్ స్పిన్నర్ గాయం తీవ్రమైతే మాత్రం సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే స్టోక్స్ సేనకు ఈ సిరీస్ లో గట్టి ఎదురు దెబ్బ తగలడం ఖాయం. స్పిన్ ప్రభావం చూపించే భారత పిచ్ లపై లీచ్ గాయం బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో రెహన్ అహ్మద్, బషీర్, హర్ట్లీ ఉన్నారు.            

తొలి రోజు ఆటలో భాగంగా లీచ్ 16 ఓవర్లు వేశాడు. రోహిత్ శర్మ వికెట్ తీసుకొని ఇంగ్లాండ్ కు తొలి వికెట్ అందించాడు. అయితే లీచ్ కు చిన్న గాయమే అని అతను మూడో రోజు బౌలింగ్ వేయడానికి వస్తాడని జట్టు యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. 35 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ ల్లో లీచ్ 125 వికెట్లు పడగొట్టాడు. 5 సార్లు 5 వికెట్ల ఘనత.. ఒకసారి మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లను తీశాడు. మరి లీచ్ కోలుకొని మూడో రోజు బరిలోకి దిగుతాడో లేకపోతే మ్యాచ్ మొత్తానికి దూరమవుతాడో చూడాలి.