T20I Bowling Rankings: టీ20 నెం.1 బౌలర్‌గా కివీస్ పేసర్.. టాప్-10 లో ఇద్దరు భారత క్రికెటర్లు!

T20I Bowling Rankings: టీ20 నెం.1 బౌలర్‌గా కివీస్ పేసర్.. టాప్-10 లో ఇద్దరు భారత క్రికెటర్లు!

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ అగ్ర స్థానానికి చేరుకున్నాడు. బుధవారం (ఏప్రిల్ 2) ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో 723 రేటింగ్ పాయింట్స్ తో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవలే పాకిస్థాన్ తో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఈ కివీస్ పేసర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సిరీస్ మొత్తంలో 8.38 సగటుతో 13 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ సిరీస్ ను 4-1 తేడాతో గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఏ ఫార్మాట్ లోనైనా డఫీ నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. 

గత వారం పేసర్ ఆడమ్ జంపాతో కలిసి ఏడు స్థానాలు ఎగబాకి ఐదవ స్థానంలో నిలిచాడు. ఈ వారంలో టాప్ ర్యాంక్ లో ఉన్న అకెల్ హోసేన్, వానిందు హసరంగా, ఆదిల్ రషీద్, వరుణ్ చక్రవర్తిని అధిగమించాడు. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడో  స్థానంలో.. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ 10 ర్యాంక్ లో ఉన్నాడు. అకెల్ హోసేన్ రెండో స్థానానికి పడిపోయాడు.  ఆదిల్ రషీద్, వానిందు హసరంగా వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. 

బ్యాటింగ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ నెంబర్ ర్యాంక్ నిలుపుకున్నాడు. భారత బ్యాటర్ల విషయానికి వస్తే అభిషేక్ శర్మ  రెండో స్థానంలో ఉన్నాడు. తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇటీవలే పాకిస్థాన్ తో జరిగిన సిరీస్ లో 268 పరుగులు చేసిన సీఫెర్ట్ 8 వ ర్యాంక్ కు చేరుకున్నాడు. ఆల్ రౌండర్లలో హార్దిక్ పాండ్య టాప్ ర్యాంక్ లోనే ఉన్నాడు.