వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూల రవీందర్

వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూల రవీందర్
  • మద్దతు ప్రకటించిన టీచర్ల సంఘాల జేఏసీ 

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల టీచర్ సెగ్మెంట్ నుంచి టీచర్ల సంఘాల జేఏసీ(జాక్టో) అభ్యర్థిగా పూల రవీందర్ పేరును ప్రకటించారు. సోమవారం హైదరాబాద్​లో నిర్వహించిన జాక్టో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జాక్టో చైర్మన్ సదానందం గౌడ్, సెక్రటరీ జనరల్ కృష్ణుడు మాట్లాడుతూ.. తెలంగాణలో టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల పక్షాన చట్టసభల్లో ఆశించినంత చర్చ జరగడం లేదన్నారు. అందుకే సమర్థులైన వారిని చట్టసభల్లోకి పంపించాలనే ఉద్దేశంతో గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన పూల రవీందర్​ను బరిలోకి దింపుతున్నట్టు చెప్పారు. 

40 ఏండ్ల పాటు ఉపాధ్యాయ సంఘం నేతగా, తెలంగాణ ఉద్యమ సమయంలో టీటీజేఏఏసీ చైర్మన్​గా క్రియాశీలక పాత్ర పోశించారని గుర్తుచేశారు. ఇప్పటికే సుమారు 30 సంఘాలు పూల రవీందర్​కు మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా పూల రవీందర్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఓడిపోయినా టీచర్ల సమస్యల పరిష్కారం కోసమే కృషి చేశానని చెప్పారు. టీచర్ల జేఏసీ విజ్ఞప్తి మేరకు మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నానని, తనను గెలిపించాలని టీచర్లు, లెక్చరర్లను కోరారు.

 సీపీఎస్ రద్దు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు కోసం, ప్రతినెలా టీచర్లకు ప్రమోషన్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో జాక్టో నేతలు చెన్నయ్య, వేణుగోపాల్, రాధాకృష్ణ, పర్వత్ రెడ్డి, బాల శ్రీనివాస్ పటేల్, రమేశ్, లక్ష్మణ్ గౌడ్, సత్యనారాయణ, బ్రిజేశ్, నగేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.