గవర్నమెంట్​ స్కూళ్లను డెవలప్​ చేస్తా

గవర్నమెంట్​ స్కూళ్లను డెవలప్​ చేస్తా

బాలానగర్, వెలుగు: నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ది చేసి, నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. సోమవారం బాలానగర్, రాజాపూర్ మండలంలోని జడ్పీబాయ్స్, గర్ల్స్  హైస్కూల్​ స్టూడెంట్లకు షూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్  స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు తన సొంత డబ్బులతో విద్యార్థులకు సహకారం అందిస్తానని తెలిపారు. బాలానగర్, మిడ్జిల్  మండలాలకు డిగ్రీ కాలేజీ, రాజాపూర్ మండలానికి జూనియర్​ కాలేజీ మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు చెప్పారు.

ఇప్పటికే రాజాపూర్ కు జూనియర్​ కాలేజీ మంజూరు చేశారని, సీఎస్ఆర్  ద్వారా నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లలో సౌలతులు కల్పించి అభివృద్ధి చేస్తానని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే స్టూడెంట్స్ కు షూతో పాటు బ్యాగ్స్, వాటర్ బాటిళ్లను ఇస్తానని ప్రకటించారు. అనంతరం బాలానగర్  వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. 

కాంగ్రెస్  ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. గత బీఆర్ఎస్  పాలనలో చేసిన రుణమాఫీ వడ్డీకే సరి పోయిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. ఏఎంసీ చైర్ పర్సన్  గుమ్మళ్ల అశ్విని, వైస్  చైర్మన్  శేఖర్ గౌడ్, డైరెక్టర్లు ప్రమాణస్వీకారంచేశారు.