- నియోజకవర్గంలో పర్యటిస్తున్న అనిరుధ్‌రెడ్డి
- టికెట్ ఎర్ర శేఖర్కేనని సోషల్ మీడియాలో అనుచరుల పోస్టులు
మహబూబ్‌నగర్, వెలుగు:జడ్చర్ల కాంగ్రెస్ టికెట్ కేటాయింపు హైకమాండ్‌కు తలనొప్పిగా మారుతోంది. ఈ సెగ్మెంట్ నుంచి టికెట్ కోసం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పోటీ పడుతున్నారు. 10 రోజుల కింద పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వీరి మధ్య కాంప్రమైజ్ చేసినట్లు వార్తలొచ్చాయి. జడ్చర్ల నుంచి అనిరుధ్‌రెడ్డి పోటీ చేస్తాడని, నారాయణపేట నుంచి పోటీ చేయాలని ఎర్ర శేఖర్ కు సూచించినట్లు తెలిసింది. అయితే, తాజాగా ఎర్ర శేఖర్ కేడర్ ఇందుకు ఒప్పుకోవడం లేదని సమాచారం. ఎలాగైనా జడ్చర్ల సెగ్మెంట్ నుంచే పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది.
టికెట్ లొల్లి..
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సన్నిహితుడైన అనిరుధ్‌రెడ్డి గత ఎన్నికల్లో టికెట్ ఆశించినా రాలేదు. దీంతో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మల్లు రవికి సపోర్ట్ చేశారు. ఈ సారి టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకొని, మూడేండ్లుగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలు సక్సెస్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన ‘భారత్ జోడోయాత్ర’, సీఎల్పీ నేతభట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర’ సక్సెస్ చేయడంలో కీ రోల్ పోషించారు. అయితే బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎర్ర శేఖర్ రెండేళ్ల కింద ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఆయన జాయిన్ కావడానికి ఏడాది వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎర్ర శేఖర్ పార్టీలో జాయిన్ అప్పటి నుంచి అనిరుధ్‌రెడ్డితో విభేదాలు స్టార్ట్ అయ్యాయనే ప్రచారం ఉంది. ఇద్దరూ వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. పార్టీ కేడర్ కూడా రెండుగా చీలిపోయింది. జడ్చర్ల టికెట్ విషయంలో కూడా పోటీ నెలకొంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అనిరుధ్‌రెడ్డి హైకమాండ్‌తో టికెట్ తనకే ఇవ్వాలని కోరుతున్నాడు. తానే సీనియర్ కావడంతో పాటు ముందు నుంచి పార్టీ కోసం పని చేస్తున్న విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో రెండు నెలలుగా నియోజకవర్గంలో ప్రజాహిత పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఎర్ర శేఖర్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ‘రైతు భరోసా యాత్ర’ పేరుతో ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జడ్చర్ల టికెట్ విషయంపై ఇటీవల పార్టీ ముఖ్య నేతలు అనిరుధ్, ఎర్ర శేఖర్‌తో రహస్యంగా సమావేశం అయినట్లు తెలిసింది. అనిరుధ్ జడ్చర్ల నుంచి, బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న నారాయణపేట నుంచి ఎర్ర శేఖర్ పోటీ చేయాలని చెప్పినట్లు తెలిసింది. ఇటీవల సోషల్ మీడియాలో జడ్చర్ల కాంగ్రెస్ నుంచి ఎర్ర శేఖర్ పోటీ చేస్తున్నట్లు అనుచరులు పోస్టులు పెడుతున్నారు.
సీక్రెట్ ఇదేనా?
జడ్చర్ల టికెట్ కేటాయింపు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. కొద్ది రోజులుగా రేవంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారు. దీనికి కారణం జడ్చర్ల టికెట్ అంశమేనని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ అద్దంకి దయాకర్‌కు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈయన రేవంత్‌రెడ్డికి సన్నిహితుడు. అయితే, పాలమూరు జిల్లాకు చెందిన అనిరుధ్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని వెంకట్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ ఉంది. అనిరుధ్‌కు టికెట్ ఇవ్వడం ద్వారా దయాకర్‌కు కూడా లైన్ క్లియర్ అవుతుందనే ఉద్దేశంతోనే ఇటీవల కాంప్రమైజ్ మ్యాటర్ నడిచిందనే వాదనలు వినిపిస్తున్నాయి.