జడ్చర్ల టౌన్, వెలుగు : గూడ్స్ రైలు నుంచి బోగీలు విడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి డోన్ వెళ్తున్న గూడ్స్ శుక్రవారం ఉదయం 11 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరింది. దాదాపు ఒంటి గంట ప్రాంతంలో జడ్చర్ల స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్-2 మీదుగా వెళ్తుండగా, ప్రమాదవశాత్తు ఇంజిన్‌నుంచి బోగీలు విడిపోయాయి. అప్పటికే స్టేషన్లో లోకల్ప్యాసింజర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణికులు ఇంజిన్‌నుంచి బోగీలు విడిపోయిన విషయాన్ని గమనించి కేకలు వేశారు.
అప్రమత్తమైన లోకో పైలట్ బ్రేకులు వేసి ఇంజిన్‌ను ఆఫ్చేశాడు. అప్పటికే ఇంజిన్దాదాపు 400 మీటర్ల ముందుకు వెళ్లిపోయింది. మళ్లీ ఇంజిన్‌ను రివర్స్ తీసుకొచ్చి బోగీలను జత చేశారు. ఈ విషయంపై స్టేషన్ మాస్టర్ శంకర్‌ను వివరణ కోరగా గూడ్స్ రైలుకు బ్రేకులు వేసే సమయంలో బోగీలకు ఉన్న క్లిప్పులు ఊడిపోతే ఇలా జరుగుతుందన్నారు. బోగీలు వేరయిన వెంటనే ఇంజిన్‌లో ఆటోమెటిక్‌గా బ్రేకులు పడతాయన్నారు.