- జడ్డూ, కేఎల్‌కు గాయాలు
- టీమిండియాలోకి సర్ఫరాజ్, సౌరభ్ కుమార్
- సుందర్‌ను కూడా చేర్చిన సెలెక్టర్లు
హైదరాబాద్: తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో కంగుతిన్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండో మ్యాచ్‌కు దూరమయ్యారు. ఉప్పల్‌లో ఆదివారం ఇండియా ఛేజింగ్‌లో వేగంగా సింగిల్ తీసే ప్రయత్నంలో జడేజా తొడ కండరాల గాయానికి గురయ్యాడు. రాహుల్ సైతం కుడి తొడ కండరాలు పట్టేసి ఇబ్బంది పడ్డాడు.
గతేడాది మేలోనూ తొడ కండరాల గాయానికి గురైన రాహుల్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దాంతో అతను నాలుగు నెలలు ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం జడేజా, రాహుల్‌ను బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని బీసీసీఐ సోమవారం తెలిపింది. ఇప్పటికే గాయంతో మహ్మద్ షమీ, వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు రాహుల్, జడేజా గాయపడటంతో ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌లో జరిగే రెండో టెస్టులో ఆతిథ్య జట్టు నలుగురు సీనియర్లు, కీలకమైన ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగనుంది.
ఇది జట్టుపై ఒత్తిడి పెంచనుంది. కాగా, రాహుల్, జడేజా గాయపడటంతో సెలెక్షన్ కమిటీ ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్‌తో పాటు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను రెండో టెస్టు కోసం జట్టులో చేర్చింది. డొమెస్టిక్ క్రికెట్‌లో దంచికొడుతున్న సర్ఫరాజ్‌తో పాటు సౌరభ్‌కు తొలిసారి నేషనల్ టీమ్ నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల ఇండియా–ఎ తరఫున ఇంగ్లండ్ లయర్స్‌తో సిరీస్‌లో సర్ఫరాజ్ సత్తా చాటాడు.
కోహ్లీ ప్లేస్‌లో ఇప్పటికే రజత్ పటీదార్‌ను సెలెక్టర్లు టీమ్‌లో చేర్చారు. ఈ నేపథ్యంలో వైజాగ్ టెస్టులో సర్ఫరాజ్, రజత్‌లో ఒకరు అరంగేట్రం చేసే చాన్సుంది. మరోవైపు ఆల్‌రౌండర్ అయిన జడేజాకు సుందర్ సరైన రీప్లేస్‌మెంట్‌గా కనిపిస్తున్నాడు. ఇక, పేసర్ అవేశ్ ఖాన్ తన రంజీ టీమ్ మధ్య ప్రదేశ్‌తో కొనసాగుతాడని, అవసరం అయితే టెస్టు టీమ్‌లో చేరుతాడని బీసీసీఐ తెలిపింది.
ఖాన్ కల నిజమాయె
ఇండియా క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ పేరు తెలియని వారుండరు. డొమెస్టిక్ సర్క్యూట్‌లో అతను అద్భుత పెర్ఫామెన్స్ చేస్తున్నాడు. రంజీ ట్రోఫీలో కొన్నాళ్లుగా ఖాన్ హవా నడుస్తోంది. ఇప్పటిదాకా 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ 14 సెంచరీలతో 3912 రన్స్ చేశాడు. తన ఖాతాలో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. 69.85 సగటుతో అత్యంత నిలకడగా ఆడుతున్న ప్లేయర్లలో ఖాన్ ముందున్నాడు.
అయినా సెలెక్టర్లు అతడిని నేషనల్ టీమ్‌లోకి ఎంపిక చేయకపోవడంపై తరచూ విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా గత రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఏకంగా 928 రన్స్‌తో విజృంభించాడు. అయినా సెలెక్టర్ల నుంచి పిలుపు రాకపోవడంతో ఈ ముంబైకర్ చాలా బాధపడ్డాడు. అద్భుత టాలెంట్, టన్నుల కొద్దీ రన్స్ చేసే సత్తా, గంటల కొద్దీ క్రీజులో నిలిచే ఓపిక ఉన్నా అతడిని టెస్టు టీమ్‌లోకి ఎందుకు తీసుకోవడం లేదని పలువురు మాజీలు సైతం ప్రశ్నించారు.
సెలెక్టర్లు తనను విస్మరించినా కుంగిపోనని, బ్యాట్‌తోనే సమాధానం చెబుతానని చెప్పిన సర్ఫరాజ్ అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండో అనధికార టెస్టు మ్యాచ్‌లో భారీ సెంచరీ (161)తో సత్తా చాటాడు. ఇప్పుడు రాహుల్ గాయపడటంతో నేషనల్ టీమ్‌లోకి రావాలన్న అతని కల నిజమైంది. రంజీ ట్రోఫీలో రాణిస్తున్న వెటరన్ పుజారాను కాదని సెలెక్టర్లు 26 ఏండ్ల సర్ఫరాజ్‌కు చాన్స్ ఇవ్వడం చూస్తే భవిష్యత్తును ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని అర్థం అవుతోంది.
30 ఏండ్లకు టీమ్‌లోకి
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన 30 ఏండ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ కాస్త లేటు వయసులో నేషనల్ టీమ్‌లోకి వచ్చాడు. 2021లో ఇంగ్లండ్ టీమ్ ఇండియా టూర్‌కు వచ్చినప్పుడు సౌరభ్ అతిథ్య జట్టుకు నెట్ బౌలర్‌గా పని చేశాడు. మూడేండ్ల తర్వాత నేషనల్ టీమ్‌లో చాన్స్ దక్కించుకున్నాడు. 68 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 290 వికెట్లు తీసిన సౌరభ్ 2061 రన్స్ చేశాడు. బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణించగలడు.