టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా ఈ స్పిన్ ఆల్ రౌండర్ భారత జట్టులో రెగ్యులర్ ప్లేయర్. ఐసీసీ టోర్నీల్లో తుది జట్టులో ఖచ్చితంగా స్థానం ఉండాల్సిందే. లోయర్ ఆర్డర్ లో విలువైన పరుగులు చేయడంతో పాటు స్పిన్ తో మ్యాజిక్ చేస్తాడు. దశాబ్ద కాలంగా ఐసీసీ టోర్నీల్లో కీలక పాత్ర పోషిస్తున్న జడేజా ప్రస్తుతం తడబడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా దారుణంగా విఫలమవుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో ప్రభావం చూపలేకపోతున్నాడు.
వెస్టిండీస్, అమెరికా గడ్డపై వరల్డ్ కప్ అంటే జడేజా కీలకం కావడం గ్యారంటీ అనుకున్నారు. అయితే జడేజా ఇప్పటివరకు తన మార్క్ చూపించలేదు. 5 మ్యాచ్ లాడితే ఒక్క వికెట్ తీయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే 10 పరుగులైనా చేయలేదు. ఒక ఐసీసీ టోర్నీలో జడేజా ఇలా విఫలమవడం ఇదే తొలిసారి. జడేజా లాంటి ప్లేయర్ ఉంటే ఆ జట్టుకు కొండంత బలం. కానీ జడేజా మ్యాజిక్ మిస్ అవుతుంది. ఇప్పటికే సూపర్ 8 లో ఒకటే మ్యాచ్ మిగిలింది. ఈ వరల్డ్ కప్ లో భారత్ సెమీస్ కు చేరడం దాదాపు ఖాయంగా మారింది.
సెమీస్, ఫైనల్లో జడేజా రాణించడం టీమిండియాకు చాలా ముఖ్యం. బిగ్ మ్యాచ్ ల్లో ఒత్తిడిని తట్టుకొని ఆడడం జడేజా దిట్ట. నాకౌట్ మ్యాచ్ ల్లో జడేజా గాడిలో పడడం టీమిండియాకు చాలా కీలకం. ఆడినా.. ఆడకున్నా తుది జట్టులో జడేజా స్థానం పక్కా. అతని స్థానాన్ని ప్రశించే హక్కు.. అతన్ని పక్కనపెట్టే ధైర్యం ఎవరూ చేయరు. జడేజా లాంటి సీనియర్ ప్లేయర్ ఫామ్ లోకి రావడానికి ఒక్క మ్యాచ్ చాలు. వీలైనంత త్వరగా ఫామ్ అందుకుంటే భారత్ వరల్డ్ కప్ లో మరింత పటిష్టంగా మారుతుంది.