మహాముత్తారం, వెలుగు: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాడీ కీర్తిబాయి మృతి తీరని లోటని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జాడి కీర్తిబాయి మృతి చెందగా మంత్రి శ్రీధర్‌బాబు, కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ బోర్లగూడెంలో కీర్తిబాయి పార్థివదేహానికి నివాళులర్పించారు. తర్వాత ఆమె అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. తర్వాత మీడియాతో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మండలంలో కీర్తిబాయి పార్టీ పటిష్టత కోసం ఎంతో కృషి చేశారన్నారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కీర్తిబాయి, ఆమె భర్త రాజయ్యకు మెరుగైన వైద్య సేవలందించేందుకు వరంగల్‌కు తరలించామన్నారు. అయితే కీర్తిబాయి ప్రాణం దక్కలేదన్నారు. రాజయ్యకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే హైదరాబాద్ తరలించి చికిత్స చేయిస్తామన్నారు. కీర్తిబాయి కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారని, పార్టీ పక్షాన ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పినట్లు వివరించారు. అంత్యక్రియల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్‌రెడ్డి, మండలాధ్యక్షుడు పక్కల సడువలి, లీడర్లు దుర్గయ్య, వెంకటరెడ్డి, నజీర్ ఖాన్ హాజరయ్యారు.