కొరిటికల్ లో ఇంటింటి ప్రచారం చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

మునుగోడు, వెలుగు : రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్​ పైసలను జిల్లా అభివృద్ధికి ఇస్తే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.  సోమవారం నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని కొరటికల్ నుంచి టీఆర్ఎస్ ​ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటి ప్రచారం చేసిన ఆయన మాట్లాడుతూ హిందూమతం గురించి వేదాలు వల్లించే బీజేపీ ప్రభుత్వం యాదాద్రి పునర్నిర్మాణానికి రూ.100 చందా కూడా ఇవ్వలేదన్నారు. మునుగోడులో టీఆర్ఎస్​ను గెలిపిస్తే నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. వడ్డీకి అప్పులు తెచ్చి భవిష్యత్ తరాలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బంది ఉండకూడదని దామరచర్లలో 30, 000  కోట్లతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నామన్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఆగిపోయిన పనులను పూర్తి చేయిస్తానన్నారు. తర్వాత మండలంలోని గూడపూర్, గంగొరిగూడం సింగారం, రత్తిపల్లి , ఊకోండితో పాటు పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకులు పల్ల వెంకట్​రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెలికంటి సత్యం, ఎంపీపీ కర్ణాటక స్వామి యాదవ్, టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు బండ పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.