సూర్యాపేట, వెలుగు: కరెంట్‌తో పెట్టుకోవద్దని కాంగ్రెస్ పెద్దలకు అర్థమైందని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట నమ్మి నాలుక కరుచుకున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. కరెంట్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లతో కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందన్నారు. లాగ్ బుక్‌లతో పనేముందని, ఇంటర్నల్ ఎఫీషియన్సీ చూసుకోడానికే దాన్ని ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నామో .. లేదో..? రైతులను అడిగితే చెబుతారని సూచించారు. లేదంటే 24 గంటల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా వైర్లు పట్టుకుంటే తెలుస్తుందని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ నేతలు కరెంట్, సాగు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. విత్తనాలు అడిగితే లాఠీచార్జి చేయడమే కాదు ఎరువులను పోలీస్ స్టేషన్లలో పెట్టి విక్రయించిన చరిత్ర ఆ పార్టీదని ఎద్దేవా చేశారు. ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కర్నాటకలో 24 గంటల కరెంట్, తక్కువ ధరకు ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టాన్ని సాగుకుగా చూసి లాభాలకు ప్రైవేటుకు అమ్మి జైలుకు వెళ్లిన చరిత్ర ఎవరిదో అందరికీ తెలుసని విమర్శించారు. విద్యుత్ విషయంలో ఎంత నష్టం వచ్చినా రైతాంగం కోసం భరించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ALSO READ :బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే.. నకిలీ విత్తన వ్యాపారులు : ప్రవీణ్ కుమార్
మెడికల్ కాలేజీ, ఎస్టీపీ ప్లాంట్లను సందర్శన
ఈ నెల 24 న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న మెడికల్ కాలేజీ కొత్త భవనంతో పాటు ఎస్టీపీ ప్లాంట్‌ను సోమవారం మంత్రి జగదీశ్ రెడ్డి సందర్శించారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ పనులు పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసి ఓపెనింగ్‌కు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు, బీఆర్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు ఉన్నారు.