- ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
- జగద్గిరిగుట్టలో ఘటన
జీడిమెట్ల, వెలుగు : కొత్త సెల్ ఫోన్ కొనివ్వలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో ఆదివారం జరిగింది. గుట్టలోని కేటీఆర్ కాలనీకి చెందిన నితీశ్ రాజు (27) గత కొంతకాలంగా ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. అతడు ఈ నెల 23న తన సెల్ ఫోన్ పొగొట్టుకున్నాడు. శనివారం రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తండ్రి శ్రీనివాసరాజుకి ఫోన్ పోయిన విషయం చెప్పి, కొత్తది ఇప్పించాలని అడిగాడు.
ప్రస్తుతం తన దగ్గర డబ్బుల్లేవని, వచ్చే నెల కొంటాను అని తండ్రి చెప్పాడు. తనకు వెంటనే కావాలని నితీశ్ రాజు పట్టుబట్టగా, తండ్రి ఒప్పుకోలేదు. నెల రోజులు తాను ఆగలేనని చెప్తూ, కోపంతో బెడ్ రూమ్‌లోకి వెళ్లి రాజు తలుపేసుకున్నాడు. అతను పడుకొని ఉంటాడని భావించిన తల్లిదండ్రులు.. రాత్రి భోజనం చేసి, నిద్రపోయారు. ఉదయం లేచి చూసేసరికి రాజు బెడ్రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.