సూర్యాపేట, వెలుగు: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఓట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ విమోచనంపై అమిత్ షాతో పాటు బీజేపీ లీడర్లు అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పాత గాయాలను రగిలించి సమాజాన్ని చీల్చాలని చూస్తున్నారని విమర్శించారు. వీరి తీరు దేశ మనుగడకు ప్రమాదకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు తిప్పికొడుతారని స్పష్టం చేశారు. కర్నాటకలో కేసీఆర్ లాంటి ప్రత్యామ్నాయం లేకనే అక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారన్నారు. అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ఇక్కడ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ గత చరిత్ర ప్రజలకు తెలుసని, సోనియా, రాహుల్ గాంధీల మాటలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
మహిళ ఆరోగ్య భద్రతకే రుతుప్రేమ
మహిళల ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో రుతుప్రేమ కార్యక్రమాన్ని చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ఆదివారం కలెక్టరేట్‌లో బెంగళూరుకు చెందిన పర్యావరణవేత్త డాక్టర్ శాంతి ఆధ్వర్యంలో రుతుప్రేమపై మహిళలకు నిర్వహించిన అవగాహన సదస్సుకు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. మహిళలు రుతుస్రావ సమయంలో రసాయనిక ప్యాడ్స్ వాడటం వల్ల అనారోగ్య పాలుకావడమే కాదు పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు.
3ప్యాడ్స్ బదులు కప్స్ వాడే విధంగా డాక్టర్ శాంతి ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్‌రావు, అడిషనల్ కలెక్టర్ ప్రియాంక, జడ్పీ చైర్ పర్సన్ దీపికా యుగంధర్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ అన్నపూర్ణ, డీడబ్ల్యూవో జ్యోతి పద్మ, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ శారద తదితరులు పాల్గొన్నారు.