ప్రజల పార్టీని గుర్తించాలి.. కాంగ్రెస్ పై తిరగబడాలి: మంత్రి జగదీష్ రెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు ఆపాలని  కాంగ్రెస్ నేతలు కుట్ర చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(అక్టోబర్ 26) సూర్యాపేట జిల్లాలో మంత్రి, గడప గడపకు కేసీఆర్ భరోసా ప్రచారంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  రైతు బంధు ఆపేయమని కాంగ్రెస్ నేతలు, కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కు  ఫిర్యాదు చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా కుట్ర చేస్తున్న  కాంగ్రెస్ నేతలపై ప్రజలు ఉద్యమించి, తిరగబడాలని పిలుపునిచ్చారు. 

గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలదీయండని చెప్పారు.  కాంగ్రెస్ తీరు.. ఉచిత విద్యుత్ , మిషన్ భగీరదా కూడా ఆపేలా ఉందని మండిపడ్డారు. తెలంగాణ పథకాలను ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందన్నారు. కర్ణాటకలో ఏకంగా కరెంట్ కోసం సబ్ స్టేషన్లలో మొసళ్ళు వదిలే దుస్థితి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణ పథకాలు లేవని... ఇక్కడ  ఆ పథకాలను ఆపేస్తే దేశంలో ఎక్కడా పంచాయతీ ఉండదని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ , బీజేపీల అజెండా ఒక్కటేనని.. కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలను  ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ , బీజేపీలు పోటీచేసే అభ్యర్ధులను ఇచ్చిపుచ్చుకుంటున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎదగనీయకుండా చేయాలని కాంగ్రెస్ , బీజేపీలు కుట్ర చేస్తున్నాయన్నారు.  ప్రజల కోసం పని చేసే పార్టీని గుర్తించి.. గెలిపించాలని కోరారు.  బీజేపీకి రెండు సార్లు అధికారం ఇస్తే దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చిందని.. బీజేపీ పాలనలో పెనం నుండి పొయ్యిలో పడ్డ చెందంగా  దేశం పరిస్థితి తయారైందని చెప్పారు.  ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బీజేపీకి అసలు అభ్యర్థులే లేరని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.