యాదాద్రి థర్మల్​ ప్లాంట్​లో జగదీశ్​రెడ్డి 10 వేల కోట్లు తిన్నడు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ విద్యుత్​ప్లాంటు పెద్ద స్కాం అని.. గత ప్రభుత్వంలో విద్యుత్తు శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్​రెడ్డి రూ.10 వేల కోట్లు తిన్నడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్​పై వైట్​పేపర్​రిలీజ్​ సందర్భంగా మంత్రికి, జగదీశ్‌‌రెడ్డి మధ్య వాడీవేడీగా చర్చ జరిగింది. 

‘‘టెండర్‌‌ పిలువకుండా పనులు ఇవ్వడమే పెద్ద కుంభకోణం. గత బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం 24 గంటల కరెంట్‌‌ ఎప్పుడూ ఇవ్వలేదు. సబ్‌‌స్టేషన్​లలో లాగ్‌‌ బుక్‌‌లు చూస్తే ఇదంతా స్పష్టమవుతుంది. నేను వెళ్లి పరిశీలించిన తర్వాత సబ్​స్టేషన్లలో లాగ్‌‌ బుక్‌‌లు లేకుండా చేశారు. రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగింది కనుకే నష్టాలు వస్తున్నయి” అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జగదీశ్​రెడ్డి మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలకు సిట్టింగ్‌‌ జడ్జితో విచారణ జరిపించాలని స్పీకర్​ను కోరారు. యాదాద్రి ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందన్నది అవాస్తవమన్నారు. 

‘‘మా హయాంలో అర ఎకరం కూడా ఎండలేదు. విద్యుత్‌‌పై ధర్నాలు చేసే అవకాశం మేం ఇవ్వలేదు. మా హయాంలో ఒక్క రోజు కూడా పవర్‌‌ హాలిడే ఇవ్వలేదు. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికీ అప్పులు ఉన్నయ్​. అప్పులు ఉన్నంత మాత్రాన మనందరం చెడ్డవాళ్లమా? అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు’’ అని ఆయన అన్నారు.