
సూర్యాపేట, వెలుగు : గచ్చిబౌలి భూముల వ్యవహారంలో వాస్తవ ఘటనలను సీఎం రేవంత్ రెడ్డి ఏఐకి ముడిపెట్టడం హాస్యాస్పదమని, నెమళ్ల అరుపులు, పోలీసుల లాఠీచార్జీలు, జింకల చావులు, బుల్డోజర్లు కుడా ఏఐ సృష్టేనా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం తీరు రాష్ట్ర ప్రతిష్టను దిగార్చేలా ఉందన్నారు. సీఎం వ్యవహర శైలిని చూసి సామాన్య ప్రజలు సైతం నవ్వుకుంటున్నారని తెలిపారు. అధికారులు, అనుచరులు ఇస్తున్న సలహాలపై ఆలోచించి మాట్లాడితే మంచిదని హితవు పలికారు.
సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కన్నా.. మీ అనుముల ఇంటెలిజెన్స్ ను నమ్ముకోవడమే మంచిదన్నారు. ఈ విషయంలో కోర్టుకు పోతమంటే వాళ్లకు చివాట్లు తప్పవన్నారు. జబ్బును గుర్తించకుండా మందులు వాడతామన్న తీరులా రేవంత్ పోకడ ఉందని, ఈ విషయాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకున్నప్పుడే వాళ్ల ఆలోచన మార్చుకోవాల్సిందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.