హైదరాబాద్, వెలుగు: విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో కోర్టు తీర్పు ఫైనల్ అని, కమిషన్ ఇచ్చే తీర్పు ఫైనల్ కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
గత బీఆర్ఎస్ పాలనలోనే విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామని.. ఈఆర్సీ ముందు ఆయా పార్టీల నేతలు తమ వాదనలు వినిపించారని చెప్పారు. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్లపై ఏ విచారణకైనా తాము సిద్ధమని ఆయన ప్రకటించారు.
విద్యుత్ కమిషన్ పాత్రపై కేసీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారని, విచారణ చేసే అర్హత కమిషన్ చైర్మన్ కోల్పోయారని లేఖలో పేర్కొన్నారని తెలిపారు. కమిషన్ జ్యుడీషియరీ కమిషన్ కాదని ఆయన అన్నారు. కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డిపై గౌరవం ఉందని, కానీ కమిషన్ చైర్మన్‌గా ఆయన అభిప్రాయాలు మారాయని దుయ్యబట్టారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ఎట్ల చెప్తారని ప్రశ్నించారు. ‘‘ఈఆర్సీ స్వతంత్ర కమిషన్.. అది ఇచ్చిన తీర్పు ఫైనల్. ఈఆర్సీ తీర్పు ఇచ్చాక కమిషన్ ఎట్లా వేస్తరని నర్సింహారెడ్డికి తెలియదా?” అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. 15 వరకు సమయం ఇచ్చి 11న నర్సింహారెడ్డి మీడియా సమావేశం ఎట్లా ఏర్పాటు చేశారని అన్నారు.