- కొన్ని రోజులుగా ఫామ్‌హౌజ్‌లోనే ఉంటూ కేసీఆర్‌తో చర్చలు
- విచారణకు హాజరుకావాలని ఇప్పటికే కమిషన్ నుంచి నోటీసులు
- మంత్రిగా ఆయనకు తెలియకుండా ఏ పనీ జరగదన్న నిపుణులు
- జగదీశ్‌రెడ్డికి జైలు ఖాయమంటున్న కోమటిరెడ్డి బ్రదర్స్
నల్గొండ, వెలుగు : విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిషనర్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డికి వ్యతిరేకంగా హైకోర్ట్‌ను ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి సైతం ఇరకాటంలో పడ్డారు. ప్రభుత్వం నియమించిన కమిషన్ త్వరలో రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేయనుంది. కొన్ని రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న జగదీశ్‌రెడ్డి ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో కేసీఆర్‌తో ఏకాంత చర్చలు జరుపుతున్నారు.
నాలుగైదు రోజులుగా ఫామ్‌హౌజ్‌లోనే...
బీఆర్‌ఎస్ పాలనలో జగదీశ్‌రెడ్డి పదేళ్ల పాటు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. దీంతో కమిటీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జగదీశ్‌రెడ్డి నాలుగైదు రోజుల నుంచి సూర్యాపేటకు రాకుండా ఎర్రవల్లి ఫాంహౌజ్‌లోనే మకాం పెట్టారు. కేసీఆర్‌తో కలిసి విద్యుత్ కొనుగోళ్ల ఫైళ్లను తిరగతోడుతున్నారని సమాచారం. కొంత కాలం విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్‌రెడ్డి ఆ శాఖలో కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో ఆరోపణలు రావడంతో ఆయన శాఖను మార్చారు.
ఇది జరిగిన తర్వాతే దామరచర్ల వద్ద యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఊపిరి పోసుకుంది. సుమారు రూ.30 వేల కోట్లతో ప్రారంభించిన పవర్ ప్లాంట్ అంచనా వ్యయం ప్రస్తుతం రూ.50 వేల కోట్లకు చేరుకుంది. కరోనా వల్ల పనులు ఆగిపోయాయని, దీని వల్లే అంచనా వ్యయం రూ.20 వేల కోట్లు పెరిగిందని అప్పటి ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక థర్మల్ పవర్ ప్లాంట్‌పైనే గురి పెట్టిన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి జగదీశ్‌రెడ్డిని జైలుకు పంపడం ఖాయమని ఛాలెంజ్ చేశారు.
అంచనాల పెంపుపై అనుమానాలు
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అంచనా వ్యయం రెండేళ్లలో రూ. 20 వేల కోట్లు పెరగడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ప్లాంట్‌లో జరిగిన ఇంటర్నల్ పనులు, ఇసుక అక్రమ రవాణా, అధిక రేట్లకు మెటీరియల్ కొనుగోలు చేయడం, కాంట్రాక్ట్ దక్కించుకున్న పొరుగు రాష్ట్రాల సంస్థలను బెదిరించి జగదీశ్‌రెడ్డి అనుచరులతో పనులు చేయించారని దీని వల్లే అంచనా వ్యయం భారీగా పెరిగిందని కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపించారు.
విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం మొత్తం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగినప్పటికీ సంబంధిత శాఖ మంత్రి ప్రమేయం లేకుండా, ఆయన ఆమోదం తీసుకోకుండా కొనుగోళ్లు, టెండర్లు జరగవని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నా దానికి విద్యుత్ మంత్రి బాధ్యత వహించాల్సిందేనని పలువురు చెబుతున్నారు.
విచారణకు పిలిస్తే ఎట్లా..?
విచారణ కమిటీని రద్దు చేయడం కుదరదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో జగదీశ్‌రెడ్డి ఆందోళనలో పడ్డారు. జగదీశ్‌రెడ్డి విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేయడంతో ఆయన తప్ప మరెవ్వరూ మీడియా ముందుకు వచ్చి కొనుగోళ్ల వ్యవహారంపై మాట్లాడలేకపోతున్నారు. పైగా కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన జగదీశ్‌రెడ్డి ఏం జరిగినా మా సార్ చూసుకుంటాడులే అన్న ధీమాతో ఇన్నాళ్లూ ఓపిక పట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ తారుమారు కావడంతో పాటు కమిటీ సైతం నోటీసులు ఇచ్చింది. విచారణ కమిటీ ఎదుట ఏం చెప్పాలన్నా కేసీఆర్ సూచనల మేరకే బదులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అందుకే కొన్ని రోజులుగా సూర్యాపేటను వదిలేసి, ఫాంహౌజ్‌లో కేసీఆర్‌నే అంటిపెట్టుకుని ఉన్నారని తెలిసింది. దీంతో జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టలేకపోతుండడంతో మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కేడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బీఆర్‌ఎస్ హయాంలో జిల్లాలో ఏకచక్రాధిపత్యం వహించిన జగదీశ్‌రెడ్డి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో మాత్రం ఒంటరిగానే పోరాడుతున్నారు. మరో వైపు ఎప్పుడు ఏం జరుగుతుందోనని జిల్లా నాయకులు టెన్షన్ పడుతున్నారు.