సూర్యాపేట, వెలుగు: బాండ్ పేపర్లతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ నేతలు దమ్ముంటే ఎన్నికల కమిషన్‌కు బాండ్ రాసివ్వాలని బీఆర్‌ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీలపై నమ్మకం లేకనే 42 పేజీల గ్యారంటీ తెచ్చారని విమర్శించారు. దాన్ని కూడా ప్రజలు నమ్మకపోవడంతో బాండ్ పేపర్లు రాసిస్తూ కొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు.
హామీలు అమలు చేయకపోతే తమ ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని బాండ్ రాసివ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి బాండ్లే కార్నాటకలోనూ రాసిచ్చి పత్తాలేకుండా పోయారని విమర్శించారు. హామీలు అమలు చేయమని కర్నాటక రైతులు వెంటబడితే పారిపోయారని, ఇప్పుడు తెలంగాణ రైతులను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లాగా తమది కాగితాల గ్యారంటీ కాదని, కేసీఆర్ నోటి మాటే గ్యారంటీ అని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, రాష్ట్రంలోనూ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. 2014 కు ముందు, ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకొని.. బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.