Botsa: మాజీ మంత్రి బొత్సను అభ్యర్థిగా నిలబెట్టిన జగన్

అమరావతి: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో దిగనున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. బొత్సను అభ్యర్థిగా ప్రకటించారు. ఆగస్ట్ 30నఈ ఎమ్మె్ల్సీ ఎన్నిక జరగనుంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 841 ఓట్లున్నాయి. ఇందులో వైసీపీకి 615, టీడీపీకి 215 ఓట్లు, 11 ఖాళీలున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన నామినేషన్లను ఆగస్ట్ 13 వరకూ స్వీకరించనున్నారు. 

 

వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ యాదవ్ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందడంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సను అభ్యర్థిగా జగన్ ప్రకటించడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెజారిటీ సభ్యులు బొత్సను అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేయడంతో వైసీపీ అధినేత జగన్ బొత్సను అభ్యర్థిగా ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరగబోతోంది ఉప ఎన్నికే కావడం గమనార్హం.