ఏపీలో అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మే 13న జరగనున్న ఎన్నికలకు 10రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో నేతలంతా ప్రచారం ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం హోరెత్తుతోంది. నరసరావుపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేయని వారితో సహా అడుగుతున్నానని, ఇళ్లకు వెళ్లి భార్య పిల్లలతో, అవ్వ తారలతో చర్చించాలని, మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓటు వేయండని అన్నారు.
జగన్ పాలనలో లబ్ది పొందామని విశ్వసిస్తేనే, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల ద్వారా అవినీతి రహిత పాలన కొనసాగుతుందని విశ్వసిస్తేనే ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కండని అన్నారు జగన్. ఇది కులాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న క్లాస్ వార్ అని అన్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తు రాదని, బాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖిని నిద్ర లేపినట్లే అని అన్నారు.