అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ స్పందించారు. తాడేపల్లిలో ఇవాళ (అక్టోబర్ 4) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. మాటమాటకి సనాతన ధర్మం పేరు ఎత్తుతోన్న పవన్ కల్యాణ్‌కు.. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం దేవుళ్ల ప్రతిష్టను దెబ్బ తీయడం సనాతన ధర్మమా అని పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు.
చంద్రబాబుతో కలిసి శ్రీవారి విశిష్ఠతను దెబ్బతీయడంలో పవన్ కల్యాణ్ కూడా భాగమయ్యారని అన్నారు. తప్పు చేసి క్షమాపణ చెప్పకపోగా.. ఇంకా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేవని.. శ్రీవారి కోపం తప్పు చేసిన చంద్రబాబు ఒక్కడికే పరిమితం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తోన్న తప్పుడు ప్రచారం మొత్తాన్నీ ఆ వెంకటేశ్వర స్వామే చూసుకుంటారన్నారు.