
ఆంధ్రప్రదేశ్ లో రసవత్తర రాజకీయాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ సలహాల సంస్థ అయిన ఐప్యాక్ బృందంతో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. వైసీపీకి ఐప్యాక్ సలహాలు అందిస్తూ వస్తోంది. తాజాగా శుక్రవారం ( జూన్ 7) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఐప్యాక్ టీమ్ ఇంఛార్జ్ రిషి రాజ్, వైసీపీ ముఖ్య నేతలు, ఐప్యాక్ సలహా సభ్యులు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు.
ఎప్పటికప్పుడు ఐప్యాక్ టీమ్ నుంచి రిపోర్టులు తెప్పించుకుంటూ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో తాజా పరిస్ధితిపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ( జూన్ 7) మరోసారి ఐప్యాక్ బృందంతో సీఎం జగన్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీలోనూ వైసీపీ ఎమ్మెల్యేల తాజా గ్రాఫ్, రాష్ట్రంలో విపక్ష నేతల వరుస టూర్లతో మారుతున్న పరిస్దితులపై రిపోర్టుల తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో పార్టీ తాజా పరిస్థితులపై ఐప్యాక్ సభ్యులు విశ్లేషించారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమం తీరుపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యం, పనితీరుపై సుధీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ టీమ్ నివేదిక ఇచ్చింది. దీనిపై జగన్ మరోమారు చర్చించనున్నారు. నివేదిక ఆధారంగా గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలు, వివిధ నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు వంటి అంశాలతో పాటు ఆయా నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పుపై చర్చ జరిపినట్లు సమాచారం.
ఏపీలో వైసీపీ వర్సెస్ వివక్షాలుగా రాజకీయం మారిపోయింది. అదే సమయంలో సంక్షేమాన్ని ప్రజల్లోకి భారీ ఎత్తున తీసుకెళ్లడం ద్వారా మరోసారి ఓటు అడగాలని వైసీపీ భావిస్తోంది. ఇందుకోసం పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఇంత చేస్తున్నా కొందరు ఎమ్మెల్యేలు ఇంకా ఉత్సాహంగా పనిచేయడం లేదనేది ఐప్యాక్ రిపోర్ట్. దీంతో సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు యాక్టివ్ గా ఉండే వారికే మరోసారి టికెట్లు ఇస్తానని తేల్చిచెప్పేస్తున్నారు.