హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ స్థాయిలో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో స్టేడియాల నిర్మించి, అకాడమీలను ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్ నుంచి శ్రీకారం చుట్టామన్నారు.
మహబూబ్‌నగర్‌లో హెచ్‌సీఏ నిర్మించిన స్టేడియంలో సుమారు రూ.25 లక్షల తో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే వై.శ్రీనివాస్ రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం, పెవిలియన్, డ్రెస్సింగ్ రూమ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో టాలెంటెడ్ క్రికెటర్లను వెలికి తీసి, వారికి రాష్ట్ర జట్లు తరఫున ఆడేందుకు అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈనెల 25 నుంచి ఉప్పల్ లో జరగనున్న ఇండియా– -ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ పూర్తయిన తర్వాత జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధిపై మరింత ఫోకస్ పెడతామని చెప్పారు.