మౌనమోహన్ రెడ్డి : ఏప్రిల్-11 తర్వాత మాట్లాడని జగన్

మౌనమోహన్ రెడ్డి : ఏప్రిల్-11 తర్వాత మాట్లాడని జగన్

ఎన్నికల ఫలితాలు దగ్గరపడడంతో ప్రాంతీయ పార్టీల నేతలంతా మే 23 తర్వాత అనుసరించబోయే వ్యూహాలకు పదును పెడుతున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మాత్రం తొలిదశలో పోలింగ్ ముగిసిన నాటి నుంచి మౌనంగానే ఉంటున్నారు. ఇతర నేతల్లా జాతీయ రాజకీయాలపై మాట్లాడడంగానీ, లీడర్లను కలిసే ప్రయత్నంగానీ ఆయన చేయట్లేదు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో తమ వంతు పాత్ర పోషించాలని దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని పార్టీలు బీజేపీకి మిత్రపక్షాలుగా ఎన్డీయేలో ఉంటే, మరికొన్ని పార్టీలు కాంగ్రెస్ మిత్రులుగా యూపీఏలో చేరాయి. ఎన్డీయే నుంచి బయటికొచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు యూపీఏ మిత్రుడిగా కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారు. యూపీలో అఖిలేశ్ యాదవ్, మాయావతి, బెంగాల్ లో మమతా బెనర్జీ లాంటి నేతలు ఫలితాలు వచ్చాకే ప్రధాని అభ్యర్థిపై నిర్ణయించాలన్న ఆలోచనలో ఉన్నాయి. అయితే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మాత్రమే ఈ మొత్తం వ్యవహారానికి దూరంగా ఉంటున్నారు. ఆయన మనసులో ఏం ఉందన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు.

ఓవర్ టు హైదరాబాద్

ఏప్రిల్ 11న ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిశాక పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్ లోటస్ పాండ్ లో మీడియాతో మాట్లాడారు. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందనీ, చంద్రబాబు గద్దె దిగడం ఖాయమని ధీమాగా చెప్పారు. ఆ తర్వాత ఈవీఎంల పనితీరుపై, ఈసీ వ్యవహారంపై చంద్రబాబు ఎన్ని విమర్శలు చేసినా వైసీపీ నేతలు మాట్లాడారు తప్ప జగన్ మాట్లాడలేదు. మరోవైపు పోలింగ్ తర్వాత ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ గా మారారు. బెంగాల్ లో మమత కోసం చంద్రబాబు రెండు రోజుల పాటు ప్రచారం చేశారు. వీవీప్యాట్లలో సగం వరకు స్లిప్పులను లెక్కించాలంటూ ఇతర పార్టీలతో కలిసి చంద్రబాబు సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేశారు. దీన్ని సుప్రీం తోసిపుచ్చినా మళ్లీ ఈసీని కలిసి అదే డిమాండ్ వినిపించారు. తర్వాత రాహుల్ గాంధీని కలిసి ఈ నెల 21న బీజేపీయేతర పక్షాలతో సమావేశం పెట్టాలని సూచించారు.

రాష్ట్రంలో పోలింగ్ తర్వాత 25 రోజులు మౌనంగా ఉన్న కేసీఆర్ తర్వాత దక్షిణాదిపై దృష్టిపెట్టారు. కేరళ, తమిళనాడుల్లో ఆలయాల యాత్ర చేశారు. పనిలోపనిగానే కేరళ సీఎం పినరయి విజయన్ ను, తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే అధినేత స్టాలిన్ ను కలిశారు. కర్నాటక సీఎం కుమారస్వామితో ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీల నేతలంతా కూటమిగా ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీలు తమ దగ్గరికే వస్తాయనీ, అప్పుడు తమ డిమాండ్లు సాధించుకోవచ్చని కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారు. జగన్ కూడా తనతోనే ఉన్నారని తాను కలిసిన నేతలకు కేసీఆర్ చెబుతున్నట్లు తెలుస్తోంది. జగన్ మాత్రం పోలింగ్ తర్వాత నెలరోజులకు పైగా మౌనంగానే ఉంటున్నారు. ఇతర పార్టీల నేతలెవరినీ ఆయన కలవలేదు. అటు బీజేపీతో కానీ ఇటు కాంగ్రెస్ తో కానీ టచ్ లో ఉన్నట్లుగా ఎలాంటి సంకేతాలివ్వలేదు. ఏపీలోని 25 ఎంపీ సీట్లలో కనీసం 20 సాధిస్తామని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 20 ఎంపీ సీట్లు చేతిలో ఉంటే కొత్త ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. అయినా జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రెండు పార్టీలకూ అవసరమే

అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతలు జగన్ మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే జగన్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం. బాబు కాంగ్రెస్ తో దోస్తీ చేయడం వల్ల జగన్ కచ్చితంగా తమతో వస్తారని మోడీ, అమిత్ షా ధీమాగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో దాదాపు 20 సీట్లు జగన్ కు వచ్చే అవకాశం ఉందనీ, ఆయన తమతోనే వస్తారని ఆ పార్టీ అంచనా వేస్తోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వైసీపీతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రస్తుతానికి బాబుకు దగ్గరగా ఉన్నట్లు కనిపించినా అవసరమైతే జగన్ ను కూడా కలుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మాజీ రాష్ట్రపతి
ప్రణబ్ ముఖర్జీ, మాజీ అర్థిక మంత్రి చిదంబరం, వీరప్ప మొయిలీ లాంటివారికి జగన్ తో
మంచి సంబంధాలున్నాయి. దీంతో మే 23 తర్వాత అవసరమైతే జగన్ తో మాట్లాడేందుకు వారిని ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

నేతలు కాదు నంబర్లే

వైసీపీ నేతలు మాత్రం బాబులాగ తమ అధినేత రోజూ మీడియాలో కనిపించాలనుకునే వ్యక్తి కాదంటున్నారు. జగన్ వ్యూహాత్మకంగానే మౌనంగా ఉంటున్నారనీ, ఫలితాలు వచ్చాక తమకు వచ్చే సీట్ల సంఖ్యే మాట్లాడుతుందని చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికే కేంద్రంలో తమ మద్దతు ఉంటుందని ప్రచారంలో జగన్ ప్రకటించారు. ఆ స్టాండ్ ప్రకారమే మే 23 తర్వాత మద్దతు ఉంటుందని పార్టీ నేతలంటున్నారు. మరోవైపు చంద్రబాబు తీరుపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. స్టాలిన్ ను కేసీఆర్ కలవడంతో బాబుకు నిద్రపట్టడం లేదనీ, ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనేం లేదని స్టాలిన్ చెప్పేదాకా ఆయన ఊరుకోరని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. బాబుకు 2 ఎంపీ సీట్లు కూడా రావనీ, ఆయన్ను ఎవరూ లెక్కచేయరని కామెంట్ చేశారు. మంగళవారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో మీడియాతో మాట్లాడిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవారికే తమ మద్దతని స్పష్టం చేశారు. ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే పార్టీ అడుగులు ఉంటాయన్నారు.