తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కర్నూలులో మూడు రోజులు జలదీక్ష చేసిన జగన్ అప్పుడు ఏమి మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జగన్ చేసిన జలదీక్ష ప్రసంగం వీడియోను ఉమా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రదర్శించారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, తమపై కోపంతో పోలవరం పనులు ఆపటం సరికాదన్నారు. పోలవరం పై జగన్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని..పోలవరంలో కన్నా కాళేశ్వరం లోనే జగన్ ఎక్కువసేపు గడిపారన్నారు.
పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. రూ. 16 వేల కోట్ల ప్రాజెక్టును రూ. 55 వేల కోట్లకు తాము పెంచామన్న సీఎం వైఎస్ జగన్..పోలవరం అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించగలదా అని ప్రశ్నించారు. PPA ఆమోదించిన అంచనాలు ఎంత తగ్గిస్తారో చెప్పాలన్నారు. ఎలా తగ్గిస్తారో తగ్గించి చూపాలని సవాల్ చేశారు. పోలవరం అంచనాలు తగ్గిస్తే తామూ స్వాగతిస్తామన్నారు. నిస్వార్థంగా పోలవరం పనులు చేసామని… ఏ ఆడిట్ వేసుకున్నా తమకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
అప్పటి ప్రధానిపై ఒత్తిడి తీసుకువచ్చి 7 ముంపు మండలాలని ఏపీ భూభాగం లో కలపడంతో పోలవరం కల సాకారమైదన్నారు దేవినేని . అందరి నర్ణయాలతోనే కాఫర్ డ్యాం పనులు ప్రారంభించామని …అప్పర్ డ్యామ్, లోయర్ డ్యామ్ పనులు అన్ని కూడా 60 శాతం పైగానే పూర్తి అయ్యాయన్నారు.