వైసీపీ అధినేత సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇడుపులపాయ నుండి మొదలయ్యే ఈ బస్సు యాత్ర ఇచ్ఛాపురం వరకు సాగనుంది. ప్రతిపక్షాల కంటే ముందుగా అభ్యర్థుల జాబితా ప్రకటించి దూకుడు చూపిన జగన్, ఇప్పుడు ప్రచారాన్ని కూడా అదే ఊపుతో కొనసాగించనున్నాడు.21 రోజుల పాటు సాగనున్న ఈ బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో సాగనుంది. ఇప్పటికే సిద్ధం సభల ద్వారా 4 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేసిన జగన్, ఇప్పుడు మేమంతా సిద్ధం యాత్రతో మిగిలిన నియోజికవర్గాలను కవర్ చేయనున్నాడు.
బస్సు యాత్రలో భాగంగా మొదట ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, తర్వాత బస్సు యాత్రను ప్రారంభించనున్నాడు. మొదటి రోజు కడప పార్లమెంట్ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నాడు జగన్.ఇడుపులపాయ నుంచి కుమారుని పల్లి, వేంపల్లి, సర్వ రాజుపేట, వీరపునాయునిపల్లి, గంగిరెడ్డి పల్లి, ఉరుటూరు, యర్రగుంట్ల మీదుగా సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నాడు జగన్. ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ఈ యాత్ర జరిగే 21రోజుల పాటు జనంలోనే ఉండనున్నారు.