
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని మురళి కృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోసాని భార్యను ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా పోసాని అరెస్ట్‌ను ఖండించిన జగన్.. భయపడొద్దని.. అండగా ఉంటామని పోసాని సతీమణికి ధైర్యం చెప్పారు. పోసాని అరెస్ట్ అక్రమమని.. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగన్ మండిపడ్డారు.
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని 2025, ఫిబ్రవరి 26న ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం మైహోం భుజా అపార్ట్మెంట్లో ఉంటున్న పోసాని కృష్ణ మురళి ఇంటికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో నమోదయ్యిన కేసుల్లో పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ నెంబర్ 65/25 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఏపీ నుంచి హైదరాబాద్‌లోని పోసాని ఇంటికి ఒక ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుల్స్ టీం వచ్చి పోసానిని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు.అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లె పీఎస్ కు పోసానిని తరలించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. పోసాని అరెస్ట్ నేపథ్యంలో పీఎస్ వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పీఎస్ వద్ద భారీగా బలగాలను మోహరించారు.
మరోవైపు పోసానికి బెయిల్ ఇప్పించే ప్రయత్నాలను వైసీపీ మొదలుపెట్టింది. జగన్ ఆదేశాల మేరకు ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ అన్నమయ్య జిల్లాకు బయలుదేరారు. పోసాని తరుఫున ఆయన వాదనలు వినిపించే అవకాశం ఉంది. దీంతో పోసాని కోర్టుకు రిమాండ్ విధిస్తుందా..? బెయిల్ ఇస్తుందా..? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.