యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. సభ పెట్టుకోడానికి ఎక్కడా అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ పెట్టాలి తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టుకోవాలా.. అంటూ లోకేష్ పోలీసులను ప్రశ్నించారు. జగన్ కి భయం అంటే ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసు లోకేష్ మాట్లాడుతున్న మైక్ లాక్కోవడానికి ప్రయత్నించారు. అంతకుముందు చిత్తూరులోని ఎన్ఆర్ పేట ఎన్టీఆర్ సర్కిల్ లో సభ పెట్టుకునేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో రాజ్యాంగం కల్పించిన హక్కులు హరించడం దారుణమంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవో నెం.1 ప్రకారం రోడ్ల మీద సమావేశం ఏర్పాటు చెయ్యడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో.. అందుకే ప్రత్యామ్నాయం చూపించాలని ముందుగానే అడిగామని లోకేష్ చెప్పారు. ఆ తర్వాతే పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్స్ లో సభ పెట్టుకోమని చెప్పారని స్పష్టం చేశారు. కానీ అక్కడ కూడా సభ నిర్వహించడానికి అనుమతివ్వడం లేదని ఆరోపించారు. అయితే మరి సభ ఎక్కడ నిర్వహించుకోవాలో మీరే చెప్పండని నారా లోకేష్ డీఎస్పీని ప్రశ్నించారు. ఎన్టీఆర్ సర్కిల్ లో సభ పెట్టుకోడానికి అనుమతి లేకపోవడంతో.. అక్కడే స్టూల్ పై నిలబడి చిన్న మైక్ తో తనని కలవడానికి వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి నారా లోకేష్ మాట్లాడారు.