ఏపీలో గురువారం జరిగిన వినుకొండ పాశవిక ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయాయని, యంత్రాంగం నిస్తేజంగా మారిపోయిందని మోడీ రాసిన లేఖలో పేర్కొన్నారు జగన్. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొందని, అత్యంత అనాగరిక ఘటనలు జరుగుతున్నాయని, అమానవీయ, అమానుషంగా ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా వారి ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అన్నారు.
అధికార వికేంద్రీకరణలో భాగంగా గ్రామస్థాయిలోనే ప్రజలకు అత్యంత చేరువగా సేవలందిస్తున్న గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లను కూడా వదిలిపెట్టడం లేదని, కేవలం వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థలను తెచ్చిందన్న కారణంతోనే వాటిని ధ్వంసం చేస్తున్నారని అన్నారు. అధికార కూటమి పాల్పడుతున్న దురాగతాలపై నేరుగా కలిసి నివేదించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని మోడీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు జగన్.