మెట్ పల్లి, వెలుగు: ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఆదివారం మెట్‌పల్లి నిర్వహించిన జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగింది. పట్టణంలోని కీర్తి ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరిన రథయాత్ర కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, బస్ డిపో వరకు కొనసాగింది. భారీ సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరే రామ హరే కృష్ణ.. కృష్ణ కృష్ణ హరే హరే నామ స్మరణతో పట్టణం మారుమోగింది.
రథం వెళ్లే రహదారిలో భక్తులు అందమైన ముగ్గులతో అలంకరించారు. అనంతరం కార్యనిర్వాహకులు నరహరిదాస్ ప్రవచనాలు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన హరే రామ హరే కృష్ణ భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు జువ్వాడి నర్సింగరావు, కొమిరెడ్డి విజయ్ ఆజాద్ ప్రత్యేక పూజలు చేశారు.