జగన్నాథపురం పంచాయతీకి.. జాతీయ అవార్డు

  • నీటి నిర్వహణ, సంరక్షణ విభాగంలో ఎంపిక
  • మూడో స్థానంలో ఆదిలాబాద్ జిల్లా

న్యూఢిల్లీ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జగన్నాథపురం గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు లభించింది. నీటి నిర్వహణ, సంరక్షణ చర్యలలో దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. ఈ మేరకు గురువారం కేంద్ర జల్ శక్తి శాఖ ఫోర్త్ నేషనల్ వాటర్ అవార్డ్స్ ప్రకటించింది. బెస్ట్ స్టేట్, బెస్ట్ డిస్ట్రిక్ట్​, బెస్ట్ విలేజ్, బెస్ట్ అర్బన్ లోకల్ బాడీ, బెస్ట్ మీడియా, బెస్ట్ ఎన్జీవో ఇలా మొత్తం 12 విభాగాల్లో అవార్డులు అందిస్తున్నది. ఇందులో బెస్ట్​విలేజ్​గా జగన్నాథపురం నిలవగా, బెస్ట్ డిస్ట్రిక్ట్​ కేటగిరీలో ఆదిలాబాద్ జిల్లా మూడో స్థానం దక్కించుకుంది. అలాగే ఉత్తమ విద్యాసంస్థ విభాగంలో హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

అదేవిధంగా బెస్ట్ స్టేట్ కేటగిరీలో మధ్య ప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకోగా, ఒడిశా సెకండ్ ప్టేస్ లో నిలిచింది. ఏపీ-, బీహార్ రాష్ట్రాలు సంయుక్తంగా మూడో ప్లేస్​ను పంచుకున్నాయి. ఈ నెల 17న ఢిల్లీలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌‌కర్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా జగన్నాథపురం గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక వర్గం, సెక్రటరీ, అధికారులకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు.