కాల్వలు కనిపిస్తలేవ్ .. ఇరవై ఏండ్లుగా పూర్తి కాని జగన్నాథ్​పూర్ ప్రాజెక్టు

 కాల్వలు కనిపిస్తలేవ్ .. ఇరవై ఏండ్లుగా పూర్తి కాని జగన్నాథ్​పూర్ ప్రాజెక్టు
  • ఆనవాళ్లు కనిపించని కాల్వలు.. తుప్పుపట్టిన గేట్లు
  • మిగిలినవి కేవలం 15 శాతం పనులే.. రూ.80 కోట్లిస్తే పూర్తి
  • 15 వేల ఆయకట్టుకు ప్రయోజనం

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ ​జిల్లాలో 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో దాదాపు 20 ఏండ్ల క్రితం ప్రారంభించిన జగన్నాథ్​పూర్ ప్రాజెక్ట్ పనులు ఇప్పటికీ పూర్తికా లేదు. ప్రాజెక్ట్ పనులు పూర్తి కాకపోవడంతో ఇక్కడి నీళ్లన్నీ ప్రాణహిత పాలవుతున్నాయి. కొన్నేండ్లుగా ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు పనుల మూలకుపడ్డాయి. ఫలితంగా ఆసిఫాబాద్ జిల్లాలో రెండో మధ్యతరహా ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన జగన్నాథ్ పూర్ పనులకు అతీగతి లేకుండా పోయి ఏటా వర్షాకాలంలో వరదలొచ్చి నీరంతా నదుల పాలవుతున్నాయి. సాగు నీరు లేక ఈ ప్రాంత రైతులు కేవలం వర్షాధార పంటలపై ఆధారపడి సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జగన్నాథపురం ప్రాజెక్టు పూర్తయితే రెండు పంటలు సాగు చేసుకోనే అవకాశం ఉంటుంది.

2005లో ప్రారంభం

కాగజ్ నగర్ మండలంలోని జగన్నాథ్ పూర్ వద్ద పెద్దవాగుపై 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది. వెనకబడిన ప్రాంతంలో 15 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 90 శాతం నిధులు కేంద్రమే భరిస్తూ ఈ ప్రాజెక్టుకు అనుమతిచ్చింది. సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద రూ.108 కోట్లు ఇచ్చింది. రూ. 124.64 కోట్లతో పరిపాలన అనుమతి ఇవ్వగా గ్యామన్ ఇండియా కంపెనీ రూ.118 90 కోట్లకు దక్కించుకుంది. పెద్దవాగుపై 1.05కి.మీల పొడవైన ఆనకట్ట నిర్మించడం ద్వారా రెండువైపులా తూములను ఏర్పాటు చేసి కాల్వల ద్వారా పంట భూములకు నీరందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం.

పూర్తయిన పనులు ఇవే..

ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా170 మీటర్ల మట్టికట్టితో పాటు 350 మీటర్ల 19 గేట్లతో కూడిన బ్యారేజీని నిర్మించారు.29 కిలోమీటర్ల కెనాల్, 15 కిలోమీటర్ల లైనింగ్ పూర్తయ్యింది. మొత్తం 14 డిస్ట్రిబ్యూటర్లలో మూడింటిని నిర్మించారు. కానీ ఆ తర్వాత పనులు ఆగిపోయాయి. 108 ఎకరాల ముంపు భూములకు నేటికీ పరిహారం చెల్లించకపోవడంతో రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 2019లోనే కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. తవ్విన కాలు వల్లో ముళ్ల పొదలు పెరిగి ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి. గేట్లు తుప్పు పట్టిపోయాయి. ఏండ్లు గడుస్తున్నా నిధులు లేక పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వానికి  నివేదిక పంపించాం

మధ్యలో ఆగిన జగన్నాథ్​పూర్ ప్రాజెక్ట్ స్థితిగతులపై గవర్నమెంట్​కు 2023లోనే రిపోర్ట్ పంపించాం. మరో రూ.80 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.108 ఎకరాల ముంపునకు పరిహారం విడుదల చేయాలని నివేదికలో పేర్కొన్నాం. ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నం.

తిరుపతి, ప్రాజెక్టు డీఈఈ