అమరావతి: సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలైందని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ స్పందించారు. తాడేపల్లిలో ఇవాళ (అక్టోబర్ 4) మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహరంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. దేవుడ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేసిన జగన్.. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నాడో సుప్రీంకోర్టు అర్థం చేసుకుని ఆయనకు మొట్టికాయలు వేసిందని విమర్శించారు.
రాజకీయ దుర్భుద్దితో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసి తిరుమల ప్రతిష్టను చంద్రబాబు అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్వయంగా వేసుకున్న సిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని.. ఇకనైనా దేవుళ్ల పేరుతో రాజకీయాలు ఆపాలని హితవు పలికారు. లడ్డూ కల్తీ ఇష్యూపై సీఎం చంద్రబాబు, ఆలయ ఈవో చేసిన ప్రకటనల మధ్య వ్యత్యాసం ఉందన్నారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపిన తర్వాత కూడా దేవుడంటే భయం, భక్తి లేకుండా ఇప్పటికీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : తిరుమల లడ్డూ వివాదం
చంద్రబాబుకు దేవుడు అంటే భయం, భక్తి లేదని.. ఆయనలో ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించడం లేదని విమర్శించారు. తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు చంద్రబాబును తిడితే వాళ్లు మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు, ఆదేశాలను కూడా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు చెబుతూ చంద్రబాబు రోజురోజుకు దిగజారిపోతున్నారని అన్నారు. టీటీడీలో గొప్ప వ్యవస్థ ఉందని-.. ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ లేకుంటే తిరుమలలో ట్యాంకర్లను అనుమతించరని జగన్ మరోసారి స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు తిరుమల లడ్డూ కల్తీ జరిగిదంటూ తప్పుడు ప్రచారం చేశారని నిప్పులు చెరిగారు.