సూర్యాపేట/తుంగతుర్తి, వెలుగు: నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ వ్యవహారం.. నదీ జలాలు, సాగు, తాగునీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ పదేండ్లు నిండుగా ఉండి నల్గొండ జిల్లా తాగు, సాగు, విద్యుత్ అవసరాలను తీర్చిన టెయిల్ పాండ్ నీళ్లు చోరీకి గురయ్యాయన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా టెయిల్పాండ్నీటిని ఆంధ్రా ప్రభుత్వం చోరీ చేస్తే మన ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయే లేదన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 2014 పరిస్థితి పునరావృతం అయ్యేలా కనిపిస్తోందన్నారు. కేసీఆర్ పారదోలిన ఫ్లోరోసిస్ మహమ్మారిని తట్టి లేపేలా ప్రభుత్వ పనితీరు ఉందన్నారు. టెయిల్ పాండ్ ఎందుకు ఖాళీ అయింది ? దీనికి బాధ్యులు ఎవరో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్మోసపు హమీలను నమ్మి గెలిపిస్తే ప్రజలను కరువులోకి నెట్టారన్నారు. టెయిల్‌పాండ్ నీటి విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే మరో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో రోడ్‌షో నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని కూలదోస్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పది సీట్లకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ బీఆర్‌ఎస్ క్యాండిడేట్ క్యామ మల్లేశ్, జడ్పీ చైర్మన్లు దీపిక యుగేందర్‌రావు, సందీప్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ పాల్గొన్నారు.