
- కేసీఆర్కు జగ్గారెడ్డి సవాల్
హైదరాబాద్, వెలుగు: రుణమాఫీపై చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. మంగళవా రం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.20 వేల కోట్ల రుణమాఫీ జరిగితే.. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో రూ.22 వేల కోట్ల రుణమాఫీ జరిగిందని చెప్పారు. ఈ లెక్కన కేసీఆర్ గొప్పోడా.. రేవంత్ రెడ్డి గొప్పోడా.. అనేది తెలంగాణ ప్రజ లే ఆలోచించుకోవాలని కోరారు. దీనిపై చర్చించేందుకు కేసీఆర్ ఎక్కడికి వస్తాడో చెప్పాలని సవాల్ చేశారు.
చర్చకు సిద్ధమని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నామని, పేదలు సంతోషంగా అన్నం తిన్నా, మహిళలు ఉచితం గా బస్సులో ప్రయాణిస్తున్నా.. కేసీఆర్ ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లా డుతున్నాడని ఫైర్ అయ్యారు. ఎల్కతుర్తి సభను తాము అడ్డుకున్నట్లయితే బీఆర్ఎస్ నాయకులు ఆ సభలో డ్యాన్స్ లు చేసేవారా.. అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ పాలనలో అందరికి స్వేచ్ఛ ఉందని, సెక్రటేరియట్ లోకి ప్రతి ఒక్కరు వెళ్తున్నారని, బీఆర్ఎస్ పాలనలో అది సాధ్యమైందా అని ప్రశ్నించారు.