
- హరీశ్‌రావుపై జగ్గారెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఎస్‌ఎల్బీసీ ఘటన జరిగి ఇన్ని రోజులైనా సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీశ్ రావు.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆదివారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో కొండగట్టు బస్సు ప్రమాదంలో 65 మంది ప్రయాణికులు చనిపోయినా, మూసాయిపేట రైలు ప్రమాదంలో 25 మంది మరణించినా.. అప్పటి సీఎం కేసీఆర్ ఆ ప్రమాదాలు జరిగిన ప్రదేశాలకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు.
అదే విషయంపై అప్పుడు హరీశ్ రావు తన మామ కేసీఆర్‌ను ఎందుకు అడగలేదని ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఒకలా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరోలా మాట మార్చితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్సార్ ప్రారంభించిన ఎస్‌ఎల్బీసీని మరో ఏడాదిలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి చేస్తారని చెప్పారు. పదేండ్లు అధికారంలో ఉండి దీనిని పూర్తి చేయలేని బీఆర్‌ఎస్ నేతలు ఈ ఘటనపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాగా, ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఎస్‌ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారని జగ్గారెడ్డి గుర్తుచేశారు.