![కిచెన్ తెలంగాణ](https://static.v6velugu.com/uploads/2022/12/jaggary-cheese-cake-making_z8Iip15dwR.jpg)
సింపుల్‌గా, డెలిషియస్‌గా ఉండే చీజ్ కేక్.. పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్‌కి మీల్ మేకర్ రోటీ .. ఎనర్జీ కోసం రోజుకో స్పూన్ పంజీరి.. చదువుతుంటేనే తిన్న ఫీలింగ్ వస్తోందా? తింటే ఇంకా తృప్తిగా ఉంటుంది. ఈ వారం స్పెషల్స్ ట్రై చేయండి.
జాగ్రీ చీజ్ కేక్ కావాల్సినవి :
కావాల్సినవి :
బెల్లం (జాగ్రీ) – ఒక కప్పు, చీజ్ (క్రీమ్‌లా చేసి)– ముప్పావు కిలో, నెయ్యి – అర కప్పు
డైజెస్టివ్ బిస్కెట్స్ – ఇరవై, అగార్ అగార్ – పావు టీస్పూన్
నీళ్లు – పావు కప్పు
ఫ్రెష్ క్రీమ్ – ఒక కప్పు
తయారీ : డైజెస్టివ్ బిస్కెట్స్‌ని మిక్సీలో వేసి పొడిచేయాలి. ఆ పొడిలో నెయ్యి వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో పెట్టి, కేక్‌లా సెట్ చేసి అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక చిన్న గిన్నెలో అగార్ అగార్ వేసి, నీళ్లు పోసి ఐదు నిమిషాలు నానబెట్టాలి. చీజ్ క్రీమ్‌ని బాగా గిలక్కొట్టాక, అందులో ఫ్రెష్ క్రీమ్, కొంచెం బిస్కెట్ పొడి, అగార్ అగార్ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముందు సెట్ చేసిన కేక్ పై మరో లేయర్‌లా పోసి, ఐదు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి.
మీల్ మేకర్ రోటీ
కావాల్సినవి :
మీల్ మేకర్ – ఒకటిన్నర కప్పు
ఉప్పు – సరిపడా
శనగపప్పు (నానబెట్టి) – అర కప్పు, అల్లం ముక్క – చిన్నది
పచ్చిమిర్చి, ఎండు మిర్చి – ఒక్కోటి రెండు చొప్పున
జీలకర్ర – అర టీస్పూన్
ఉల్లిగడ్డ, టొమాటో తరుగు – ఒక్కోటి మూడు టేబుల్ స్పూన్ల చొప్పున
పసుపు – పావు టీస్పూన్
కొత్తిమీర – కొంచెం
తయారీ : వేడి నీళ్లలో ఉప్పు, మీల్ మేకర్ వేసి పావుగంట నానబెట్టాలి. తర్వాత నీళ్లని పిండేయాలి. మిక్సీజార్‌లో మీల్ మేకర్, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, అల్లం ముక్క వేసి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమంలో జీలకర్ర, ఉల్లిగడ్డ, టొమాటో తరుగు, పసుపు, కొత్తిమీర వేసి కలపాలి. వాటిని ఉండలు చేసి, చేత్తో రోటీలా వత్తాలి. ఒక పాన్‌కి నూనె పూసి, అది వేడయ్యాక దానిపై మీల్ మేకర్ రోటీని రెండువైపులా కాల్చాలి.
పంజీరి
కావాల్సినవి :
నెయ్యి, బెల్లం, బొంబాయి రవ్వ – ఒక్కోటి పావు కిలో చొప్పున
బాదం పప్పు, ఎడిబుల్ గమ్ (గోండ్), నీళ్లు – ఒక్కోటి ముప్పావు కప్పు చొప్పున
జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా, ఎండు ద్రాక్ష, సోంపు – ఒక్కోటి అర కప్పు చొప్పున
ఎండు కొబ్బరి ముక్కలు – కొన్ని , తామర గింజలు (మఖానా) – మూడు కప్పులు
గుమ్మడి గింజలు – పావు కప్పు, దాల్చిన చెక్క పొడి – ఒక టీస్పూన్
తయారీ :
సోంపుని కాస్త దంచి, జల్లెడ పట్టాలి. ఒక పాన్‌లో నెయ్యి వేడి చేసి, ఎడిబుల్ గమ్, మఖానా, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఎండు కొబ్బరి ముక్కలు, గుమ్మడి గింజలు, ఎండు ద్రాక్ష, బొంబాయి రవ్వ ఒకదాని తర్వాత ఒకటి వేగించాలి. బొంబాయి రవ్వలో, సోంపు, అవిసె గింజలు కలిపి మరోసారి వేగించాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో వేగించిన ఎండు కొబ్బరి ముక్కలు, బాదం పప్పు, జీడి పప్పు, వాల్ నట్స్, పిస్తా, గుమ్మడి గింజలు వేసి కలిపి కచ్చాపచ్చాగ మిక్సీ పట్టాలి. ఎడిబుల్ గమ్, మఖానాని విడివిడిగా మిక్సీ పట్టాలి. ఒక గిన్నెలో బొంబాయి రవ్వ మిశ్రమం తీసుకుని, అందులో వేగించిన డ్రై ఫ్రూట్స్, దాల్చిన చెక్క పొడి, మిక్సీ పట్టిన పొడులు కలపాలి. మరోపాన్‌లో బెల్లం వేసి, నీళ్లు పోసి కరగబెట్టాలి. ఆ బెల్లం నీళ్లని మిశ్రమంలో కలిపితే తినడానికి రెడీ. ఇందులో నెయ్యి లేదా కొబ్బరి నూనె వాడొచ్చు. ఇది తినడం వల్ల మైగ్రైన్, వెన్ను, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కంటిచూపుకి మంచిది. మొదటిసారి తల్లి అయిన వాళ్లకు చాలా మంచిది. ఇవేకాక ఇంకా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.