జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళ కడుపులో కాటన్ క్లాత్ మర్చిపోవడంతో ఇన్ఫెక్షన్కు గురైన మహిళ ఘటనపై జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాష సీరియస్ అయ్యారు. సర్జరీ చేసిన వైద్యుల వివరాలు వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మహిళ ఆరోగ్యంపై కూగా కలెక్టర్ ఆరా తీశారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్న కలెక్టర్... దీనిపై పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ జరిగినప్పటి నుంచి తనకు తీవ్రమైన కడుపు నొప్పి ఉండేదని బాధితురాలు నవ్య చెప్పింది. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకుంటే కడుపులో కాటన్ క్లాత్ ఉన్నట్లుగా డాక్టర్లు చెప్పారని తెలిపింది. వారం క్రితం ఆపరేషన్చేసి కాటన్ క్లాత్ తో పాటు ఇన్ఫెక్షన్ గడ్డలు తొలగించారు. నిర్లక్ష్యంగా డెలివరీ చేసిన సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నవ్య శ్రీ అనే బాలింత తన తల్లిగారి ఇల్లు జగిత్యాల కావడంతో ఏరియా ఆస్పత్రిలో గతేడాది డిసెంబర్ లో ఆసుపత్రిలో చేరింది. అయితే అక్కడ ఆమెకు సిజేరియన్ చేసిన వైద్యులు పొట్టలో కర్చీఫ్, కాటన్ గుడ్డను మరిచిపోయి కుట్లు వేశారు. దీంతో అప్పటినుంచి అంటే గత 16 నెలలుగా నవ్య శ్రీ కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది.