జగిత్యాల జిల్లా కోరుట్లలో యువతి అనుమానస్పద మృతి కేసు మిస్టరీ వీడటం లేదు. దీప్తి శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు డాక్టర్లు. దీప్తి చాతి, చెంప,మెడపై గాయాలున్నాయని గుర్తించారు. అయితే ఇది హత్యే అయి ఉంటదని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేగాని అసలు విషయం తెలియదు.
పారిపోయిన దీప్తి సోదరి చందన కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. చందన దొరికితే గానీ ఈ కేసు మిస్టరీ వీడదు. చందన తన బాయ్ ఫ్రెండ్ తో నిజామాబాద్ బస్సు ఎక్కి వెళ్లినట్లు బస్టాండ్ లోని సీసీటీవీ పుటేజ్ రికార్డ్ అయ్యింది. అయితే అది చందన కాదని వేరే వ్యక్తులని పోలీసులు చెబుతున్నారు.
చందన ఆడియో కలకలం
దీప్తి సోదరి చందన తన తమ్ముడికి పంపిన ఆడియో వైరల్ అవుతోంది. ఇందులో అరేయ్ సాయి నేను అక్కను చంపలేదురా.. అక్క వోడ్కా తాగితే నేను బ్రీజర్ తాగిన, అక్క వాళ్ల బాయ్ ఫ్రెండ్ ను పిలుద్దామంటే నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అనడంతో సరే అన్నా. తర్వాత నేను ఇంట్లోంచి వెళ్లిపోదామనుకున్న..అక్కకు చెబుదామని అనుకుంటే.. అప్పటికే ఎక్కువ తాగింది. తర్వాత ఫోన్ మాట్లాడి సోఫాలో పడుకుంది. లేపినా లేవలే.. సరే పడుకుంది కదా అని డిస్టబ్ చేయలేదు. చాన్స్ దొరికిందని వెళ్లిపోయిన.నా తప్పేమి లేదు సాయి. నిజం చెబుతున్నా..అక్కను నేనెందుకు చంపుతా అని మాట్లాడినట్లు ఆడియోలో ఉంది. అయితే దీనిని పోలీసులు గానీ,దీప్తి తల్లిదండ్రులు గానీ కన్ఫర్మ్ చేయలేదు.
దీప్తి వాళ్ల ఇంటికి మద్యం బాటిళ్లు ఎవరు తెచ్చారు.. దీప్తి, చందన కాకుండా అక్కడికి ఎవరైనా వచ్చారా? చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోతుంటే దీప్తి అడ్డుకుంటే గొడవ జరిగిందా?.. ఆ గొడవలో దీప్తి ప్రాణాలు కోల్పోయిందా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి.