- ప్రాజెక్టుకు గేట్లు బిగించకపోవడంతో మునిగిన నరసింహులపల్లె
- రోళ్లవాగు పూర్తయితే 22 వేల ఎకరాలకు సాగునీరు
- సాగునీటి కోసం బావులపై ఆధారపడుతున్న రైతులు
జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా బీర్పూర్మండలం రోళ్లవాగు ప్రాజెక్ట్, దాని దిగువన ఉన్న అరగుండాల ప్రాజెక్ట్పనులు స్లోగా నడుస్తున్నాయి. గతేడాది భారీ వర్షాలకు రోళ్లవాగు పాత కట్ట కొట్టుకుపోగా.. వరద ఉధృతికి అరగుండాల ప్రాజెక్ట్ కూడా కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్ట్రూపురేఖలు మారిపోయాయి. ప్రాజెక్టులు కొట్టుకుపోవడంతో సాగునీరందక ఆయకట్టు రైతులు రెండు పంటలు నష్టపోయారు. కాగా రోళ్లవాగు ప్రాజెక్టు అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకుంటున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. కాగా వచ్చే ఏడాది వరకు అందుబాటులోకి వచ్చేలా కనపడటం లేదని రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే బీర్పూర్, ధర్మపురి మండలాల పరిధిలో 20 వేల ఎకరాలు, అరగుండాలతో మరో 2 వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరందనుంది.
1 టీఎంసీకి నిల్వ సామర్థ్యం పెంచేలా..
రూ. 136 కోట్ల అంచనాతో రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టారు. రోళ్లవాగు కెపాసిటీ 0.25 టీఎంసీ నుంచి ఒక టీఎంసీకి పెంచేందుకు పనులు ప్రారంభించారు. గతేడాది వర్షాకాలంలో పాత కట్ట తెగింది. ఆ నీరంతా సమీప పొలాల్లోకి చేరి పంటలు దెబ్బతిన్నాయి. పొలాలు కోతకు గురై, ఇసుక మేటలు ఏర్పాడ్డాయి. ఇసుక మేటలు తొలగించుకునేందుకు రైతులు ఖర్చులపాలయ్యారు. సర్కార్ ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకపోవడంతో అప్పులపాలయ్యామని రైతులు వాపోతున్నారు.
తెగిన అరగుండాల ప్రాజెక్టు
రోళ్ల వాగు ప్రాజెక్టు పాతకట్ట తెగిపోవడంతో అరగుండాల ప్రాజెక్టు పూర్తిగా తెగిపోయింది. కట్ట నిర్మాణంతోపాటు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.1.41 కోట్లు మంజూరు చేయగా రూ.96 లక్షలతో పనులు చేపట్టారు. పనులు స్లోగా నడుస్తుండడంతో వచ్చే ఏడాది కూడా ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చే చాన్స్ లేదని రైతులు అంటున్నారు. మరోవైపు రైతులు బావులపై, ఎస్సారెస్పీ నీటిపై ఆధారపడుతున్నారు. ఎస్సారెస్పీ నీటి విడుదల నిలిపేస్తే ఇబ్బందులు తప్పవని రైతులు వాపోతున్నారు. రోళ్లవాగు ప్రాజెక్టు తూములకు గేట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇటీవల వర్షాలకు నర్సింహులపల్లె గ్రామంలోకి నీరుచేరింది.
గేట్లు బిగించకపోవడంతో గ్రామంలోకి వరద
రోళ్ల వాగు ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నర్సింహులపల్లె గ్రామంలోకి నీరు రావడం ఆందోళన కలిగించింది. తూములకు గేట్లు ఏర్పాటు చేస్తే గ్రామంలోకి వరద రాదు. ఆఫీసర్లు ముందస్తు చర్యలు చేపట్టాలి.
- రాజేశ్వర్, గ్రామస్తుడు నర్సింహులపల్లె.
గతేడాది వరదలతో నష్టపోయాం
గతేడాది కురిసిన భారీ వర్షాలతో రోళ్ల వాగు కట్ట తెగిపోయింది. దీంతో ఆయకట్టు కింద వందల ఎకరాల పంట వరద పాలైంది. సర్కార్ ఆదుకోలేదు. రూ.లక్షల్లో ఖర్చు పెట్టుకుని ఇసుక మేటలు తొలగించి సాగులోకి తీసుకువచ్చాం. ఈ ఏడాది సాగునీరు వచ్చేలా కన్పించడం లేదు. ఏటా రోళ్లవాగు నీరు సాగుకు ఉపయోగపడేది. గేట్లు ఏర్పాటు చేయకపోవడంతో నీరు ఉండడం లేదు.
- నారాయణ, సారంగపూర్